
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై తెలంగాణ స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (టీఎస్‌సీపీసీఆర్) స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరపాలని ఇంటర్ బోర్డ్ కమీషనర్‌ను కమీషన్ ఆదేశించింది. విచారణ పూర్తి చేసి నిజ నిర్ధారణ కమిటీకి నివేదిక ఇవ్వాలని టీఎస్‌సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు సాత్విక్ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత కాలేజ్ మేనేజ్‌మెంట్లదేనని మంత్రి స్పష్టం చేశారు. చదువుల పేరుతో పిల్లలపై ఒత్తిడి చేయొద్దని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
Also REad: చదువుల పేరుతో పిల్లలపై వేధింపులా, బాధ్యులపై చర్యలు తప్పవు : సాత్విక్ ఆత్మహత్యపై సబితా ఇంద్రారెడ్డి
ఇకపోతే.. సాత్విక్ సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా సాత్విక్ చెప్పారు. ఆత్మహత్య చేసుకొనే ముందు సాత్విక్ సూసైడ్ లేఖ రాశారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తనను క్షమించాలని సాత్విక్ ఆ లేఖలో పేర్కొన్నారు. కృష్ణారెడ్డి , ఆచార్య , శోభన్, నరేష్ తనను వేధింపులకు గురి చేశారని ఆ లేఖలో సాత్విక్ పేర్కొన్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని సాత్విక్ ఆ లేఖలో వివరించారు. తనతో పాటు కాలేజీకి చెందిన విద్యార్ధులను వేధింపులకు గురి చేసినట్టుగా సాత్విక్ ఆ లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాదు నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో క్లాస్ రూంలోనే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీలో వేధింపుల వల్ల మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాత్విక్ ను కాలేజీలో కొట్టేవారని,దానితో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని తోటి విద్యార్ధులు అంటున్నారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉరి వేసుకున్న సాత్విక్ ను ఆస్పత్రికి తరలించడానికి కూడా యాజమాన్యం ముందుకు రాలేదని, తామే బయట వరకు మోసుకుని వచ్చి బైకర్ ను లిఫ్ట్ అడిగి అస్పత్రికి తరలించామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించి మరో హాస్టల్ కు తరలిస్తున్నారు.
ALso REad: అమ్మా, నాన్న మిస్ యూ: వేధింపులను సూసైడ్ లేఖలో ప్రస్తావించిన సాత్విక్
మరోవైపు ఇవాళ ఉదయం కాలేజీ ముందు సాత్విక్ పేరేంట్స్ ఆందోళన నిర్వహించి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న సమయంలోనే సాత్విక్ తల్లి స్పృహ తప్పి పడిపోయింది. సాత్విక్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. సాత్విక్ మృతికి కారణమైన శ్రీచైతన్య కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. గతంలో కూడా ఈ కాలేజీకి చెందిన పలు క్యాంపస్ లలో విద్యార్ధులు మృతి చెందారని ఎస్ఎఫ్ఐ నేతలు గుర్తు చేస్తున్నారు. విద్యార్ధుల మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.