హైదరాబాద్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్.. రూ. 60 లక్షల విలువైన దుంగలు స్వాధీనం

By Mahesh KFirst Published May 13, 2022, 8:22 PM IST
Highlights

హైదరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తెచ్చిన 31 ఎర్రచందనం దుంగలను మౌలాలిలోని ప్రభుత్వ స్థలంలో డంప్ చేశారు. 1500 కిలోల బరువు ఉన్న ఈ దుంగల విలువ రూ. 60 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాజధానిలో ఎర్రచందనం కలకలం రేపింది. అంతర్రాష్ట్ర ఎర్రచందనం రాకెట్‌ను హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. 1500 కిలోల బరువున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు హైదరాబాద్‌లో కనుగొన్నారు. వీటి విలువ సుమారు రూ. 60 లక్షలుగా పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కేసులో షేక్ మొహమ్మద్ రఫీ, ముల్లా బషీర్ అహ్మద్, మూర్తి అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.   వీరి నుంచి 31 దుంగల ఎర్రచందనం దుంగలను, మూడు మొబైల్ ఫోన్లను, నగదు రూ. 1600లను సీజ్ చేశారు.

నిందితుడు షేక్ మొహమ్మద్ రఫీ ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లాలోని మద్దనూర్ గ్రామానికి చెందినవాడు. నిజానికి ఆయన అరటి పళ్ల వ్యాపారి. ఆయన ఈ అరటి పళ్లను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, తెలంగాణలకు తరలిస్తూ ఉంటాడు. మరో నిందితుడు ముల్లా బషీర్ హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్ సైనిక్‌పురి నివాసి. కర్నూల్ జిల్లా వాస్తవ్యుడు. ముల్లా బషీర్ కూడా అరటి పళ్ల వ్యాపారమే చేస్తుంటాడు. వీరిద్దరూ మంచి స్నేహితులుక కూడా. కానీ, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. చితికిపోయి ఉన్నారు. దీంతో వారి ఆలోచనలు తప్పుడు మార్గంలోకి ప్రవేశించాయి. ఎర్రచందనం అక్రమ రవాణా చేయాలనే ఓ ప్లాన్ వేశారు. తద్వార వారి అప్పులను పూర్తిగా తీర్చేయాలని భావించారు. వారు కడప జిల్లాకు చెందిన బ్రహ్మంగారిమఠం నివాసి మూర్తితో కాంటాక్ట్‌లోకి వచ్చారు. వీరు ముగ్గురు కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి పథకం వేశారు.

వీరు ముగ్గురు కలిసి 1500 కిలోల బరువు ఉన్న ఎర్రచందనం (విలువ సుమారు రూ. 60,18,600) మొద్దులను హైదరాబాద్‌కు పంపారు. వాటిని హైదరాబాద్ మల్కజ్‌గిరిలోని మౌలాలి దర్గా దగ్గరలోని ఓ ప్రభుత్వ భూమిలో ఉంచారు. అయితే, ఈ ఎర్రచందనం గురించి పోలీసులకు సమాచారం అందింది.

దీంతో వారు గురువారం సాయంత్రం మల్కజ్‌గిరి పోలీసుల సహకారం ఎల్బీ నగర్ జోన్ టీమ్ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) మౌలాలిలో రెయిడ్ చేపట్టింది. మల్కజ్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో మౌలాలి దర్గా సమీపంలో డంప్ చేసిన ఎర్రచందనాన్ని వారు పట్టుకున్నారు. అలాగే, నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు.

click me!