రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. బీజేపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు గురువారంనాడు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ నేతలు ఇవాళ బాట సింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లనున్నారు. అయితే బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. బాటసింగారం వైపు రావొద్దని రాచకొండ సీపీ చౌహన్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే బీజేపీ నేతలను ముందు జాగ్రత్తగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ తో పాటు మాజీ మంత్రి డీకే అరుణను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినా కూడ వాటిని లబ్దిదారులకు అందించలేదని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
బాటసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని బీజేపీ నేతలు ప్రకటించారు. దరిమిలా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
మరో వైపు ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ కార్పోరేటర్ల ఇళ్ల ముందు పోలీసులు మోహరించారు. అదే విధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడ పోలీసులు మోహరించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అమెరికా పర్యటనను ముగించుకొని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ మధ్యాహ్నం చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి కిషన్ రెడ్డి బీజేపీ కార్యాలయానికి చేరుకుంటారు బీజేపీ కార్యాలయం నుండి కిషన్ రెడ్డి బాటసింగారం చేరుకొంటారు.