కారణమిదీ: ఇబ్రహీంపట్నంలో కు.ని. శస్త్రచికిత్స తర్వాత నలుగురు మహిళల మృతి

By narsimha lode  |  First Published Aug 31, 2022, 9:44 AM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకున్న నలుగురు మహిళల మృతికి కారణాలపై ప్రాథమిక నివేదిక అందింది. ఈ నలుగురి మృతికి ఇన్ ఫెక్షన్ కారణమని ఈ నివేది తెలుపుతుంది.


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ  శస్త్రచికిత్స చేసుకున్న నలుగురు మహిళల మృతికి ఇన్ ఫెక్షన్ కారణమని వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.  అయితే ఈ ఇన్ ఫెక్షన్ కు శస్త్రచికిత్స కు ఉపయోగించిన పరికరాలు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ఈ పరికరాలను సక్రమంగా స్టెరిటైజ్ చేయకపోవడం వల్ల ఇన్ ఫెక్షన్  వచ్చి ఉంటుందనే అభిప్రాయాన్ని వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది.  మరో వైపు మృతి చెందిన నలుగురు మహిళల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ పోస్టుమార్టం నివేదిక కోసం వైద్యఆరోగ్యశాఖాధికారులు ఎదురు చూస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారంగా ఈ నలుగురు మృతి చెందడానికి కచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. 

ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ 10 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు చేయవద్దని సర్జన్లను ఆదేశించింది ప్రభుత్వం.ఈ నెల 25న కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న వారిలో ఆరోగ్యం సరిగా లేని మహిళలను హైద్రాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆపోలో  లో 11 మంది, నిమ్స్ లో 19 మంది చికిత్స పొందుతున్నారు.

Latest Videos

undefined

also read:ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు చేసుకున్న నలుగురు మృతి: విచారణ చేస్తున్నామన్న డీహెచ్

ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో 35 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స లు జరిగాయి. అయితే మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు మహిళలు మృతి చెందారు. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. అంతేకాదు మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇంటితో పాటు  మృతుల పిల్లల చదవును ప్రభుత్వం భరించనున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు.

ఈ నెల 25న మహిళలకు కుటుంబ నియంత్రణ శస్ర్తచికిత్సలు జరిగిన తర్వాత ఇంటికి పంపారు. అయితే ఇంటికి వెళ్లిన మహిళల్లో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, రాజీవ్ నగర్ తండాకు చెందిన మౌనిక,  మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ, ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపల్లికి చెందిన  లావణ్య లు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఈ నెల 28న ఓ మహిళ చనిపోయింది. ఈ నెల 29న మరో మహిళ, ఈనెల 30న  ఇద్దరు మహిళలు మరణించారు. ఈ నెల 28న మమత, ఈ నెల 29న  సుష్మ,  ఈనెల 30న  లావణ్య, మౌనికలు  చనిపోయారు..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. 

click me!