
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉయ్యాల తాడు మెడకు చుట్టుకుని పసికందు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దిలీప్ దంపతులకు సంవత్సరం క్రితం పాప పుట్టింది. చిన్నారి కోసం ఊయ్యాల కట్టారు. అయితే మంగళవారం అది తిరిగి పాప మెడకు బిగియడంతో ఊపిరాడక చిన్నారి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయింది. పాప ఏడుపు విని పక్క గదిలో ఉన్న కుటుంబసభ్యులు పరుగు పరుగున వచ్చారు. వెంటనే ఆమెను తీసుకుని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో పాప మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాప మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.