నన్నెవరు అరెస్ట్ చేయలేరు: లైవ్‌ షో‌‌లో రవిప్రకాశ్ క్లారిటీ

By Siva KodatiFirst Published May 9, 2019, 7:03 PM IST
Highlights

తన గురించి, టీవీ 9లో ఏదో జరుగుతోందంటూ ఉదయం నుంచి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు టీవీ 9 సీఈవో రవిప్రకాశ్. 

తన గురించి, టీవీ 9లో ఏదో జరుగుతోందంటూ ఉదయం నుంచి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు టీవీ 9 సీఈవో రవిప్రకాశ్.

వార్తల నేపథ్యంలో స్పెషల్ లైవ్ షోతో తెరపైకి వచ్చిన రవిప్రకాశ్ తన గురించి వస్తున్న వార్తల వల్ల చాలా మంది గందరగోళం ఏర్పడిందని.. దీంతో ఎంతో మంది తనకు ఫోన్లు చేస్తున్నారని.. టీవీ 9కు ఫోన్లు చేస్తున్నారని అలాంటి వారందరికి ఒక్క మాట చెప్పదలచుకున్నానన్నారు.

ఎవరు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. తనను ఎవరు అరెస్ట్ చేయలేరని రవిప్రకాశ్ స్పష్టం చేశారు. తోటి ఛానెళ్లు కాస్త బాధ్యతయుతంగా వ్యవహరించి వార్తలు ప్రసారం చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

రవిప్రకాశ్ రెండు రోజుల నుంచి ఆజ్ఞాతంలోకి వెళ్లారు.. పోలీసులు వెతుకుతున్నారు, తప్పించుకుని తిరుగుతున్నారు... ఎవరో సంతకాన్ని ఫోర్జరీ  చేశారు.. టీవీ9 నుంచి వేరే ఛానెల్‌కు నిధులు మళ్లీంచారని వార్తలు వస్తున్నాయన్నారు.

ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేస్తున్నారని.. తనపై ఇంతటి అభిమానం ఉన్న తోటి ఛానెళ్లకు రవిప్రకాశ్ ధన్యవాదాలు తెలిపారు.

తాను రవిప్రకాశ్‌గా టీవీ9 ఫౌండర్, ఛైర్మన్, సీఈవోగా టీవీ9 హెడ్ క్వార్టర్స్, బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నానని.. గత పదిహేను సంవత్సరాలుగా తాను ఇక్కడి నుంచే పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో టీవీ9 విజయకేతనం ఎగురువేసిందని, జర్నలిజమంటే మసాలా వార్తలు కాదని... సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావడమని రవిప్రకాశ్ తెలిపారు.

ఎన్‌సీఎల్టీ కేసు 16వ తేదీ విచారణకు రానుందని.. దానిని అడ్డం పెట్టుకుని కొందరు తనపై తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారని.. అయితే అలాంటి తప్పుడు కేసులు నిలబడవని, సత్యానిదే అంతిమ విజయమన్నారు.

తాను ఎక్కడికి పారిపోలేదని మొన్న రాత్రి 9 గంటల బులెటెన్‌లో ప్రజలు తనను చూశారని.. నిన్న తాను బయటి వూరికి వెళ్లడం వల్ల ఆఫీసుకు చేరుకోవడంలో ఆలస్యమైందని రవిప్రకాశ్ వెల్లడించారు.

టీవీ9 ఎప్పటిలా సామాజిక బాధ్యతతో వార్తలు ప్రసారం చేస్తుందని, ఎటువంటి ఆరోపణలనైనా తిప్పి కొట్టి జర్నలిజానికి సంబంధించిన విలువలతో వార్తలను ప్రసారం చేస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు.

టీవీ9 గత 15 సంవత్సరాలుగా నెంబర్‌వన్ పొజిషన్‌లో ఉందన్నారు. క్రెడిబిలిటి విషయంలో పనిచేసి వున్నా, మిగిలిన ఛానెల్స్ ఇచ్చిన తప్పుడు వార్తలకు ధన్యవాదాలని వారు భవిష్యత్తులోనైనా క్రెడిబుల్ న్యూస్ టెలికాస్ట్ చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

జర్నలిజం విలువల కోసం తాము ఎప్పుడు నిలబడ్డామని.. భవిష్యత్తులోనూ నిలబడతామని రవిప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ గందరగోళాన్ని తగ్గించేందుకు తాను ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు
 

click me!