కొంత కాలం కిందట బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. కొద్ది సేపటి క్రితమే ఢిల్లీలో బీజేపీలో చేరారు. ఆయనను కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
బోథ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ నేత రాథోడ్ బాపురావు (Rathod bapurao) కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనను ఢిల్లీ పెద్దల సమక్షంలో కిషన్ రెడ్డి బీజేపీ (BJP)లోకి ఆహ్వానించారు. 2014లో బీఆర్ఎస్ (BRS) తరుఫున మొదటిసారి బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో కూడా అదే పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఈ సారి కూడా పార్టీ తనకు టికెట్ కేటాయిస్తుందని ఆశపడ్డ బాపురావుకు నిరాశ ఎదురైంది. కొంత కాలం సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. గత ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లోకి వచ్చి, నేరడిగొండ జడ్పీటీసీగా ఉన్న అనిల్ జాదవ్ కు అదిష్టానం టికెట్ కేటాయించింది. ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తదనంతర పరిణామాల్లో ఆయన అధికార పార్టీలోకి చేరారు.
తనకు టికెట్ కేటాయించకపోవడంతో బాపురావు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ దానిని ఆయన ఖండించారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని తేల్చిచెప్పారు. కానీ కొన్ని రోజులకే ఆయన బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తరువాత అక్టోబర్ 17వ తేదీన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలోనూ ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ పార్టీ బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ వన్నెల అశోక్ కుమార్ కు స్థానం కల్పించింది.
దీంతో తాజాగా ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరి కొందరు నాయకులతో కలిసి ఆయన బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ అగ్రనేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా.. ఇప్పటికే బీజేపీ బోథ్ నుంచి ఎంపీ సోయం బాపురావును తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.