పొర్లు దండాలు పెట్టినా.. పదిసార్లు పర్యటించినా ఫలితం శూన్యమే

By Rajesh Karampoori  |  First Published Nov 1, 2023, 4:36 PM IST

Minister Srinivas Goud: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.


Minister Srinivas Goud: తెలంగాణ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది అన్ని రాజకీయ పార్టీలు ప్రచార పర్వంలో బిజీ బిజీ అవుతున్నాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తగ్గేదేలేదంటూ రోజుకు రెండు, మూడు చొప్పున భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఓటర్ మహాశయులను ఆకర్షించేలా హామీల వర్షాన్ని కురిపిస్తున్నారు.

ఇక బిజెపి పార్టీ తమ అభ్యర్థులను పూర్తిగా ప్రకటించకున్నా.. ప్రచారంలోకి దిగింది. ఆ పార్టీ అగ్ర నాయకులను ప్రచారంలో దించుతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో దూకుడు కనబరుస్తోంది. అధికారం తమ హస్తగతం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ తరంలో పార్టీ  అగ్రనేత అయిన రాహుల్ గాంధీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భారీ బహిరంగ సభలలో పాల్గొంటూ.. హామీల వర్షాన్ని కురిపిస్తున్నారు. 

Latest Videos

ఈ తరుణంలో రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనపై మంత్రి శ్రీనివాసగౌడ్ తనదైన శైలిలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పదిసార్లు తెలంగాణలో పర్యటించినా.. పండి పండి పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందంటూ రాహుల్ విమర్శలు చేస్తున్నారని, మరి రాహుల్ గాంధీకి ఉన్న అర్హత ఏమిటో చెప్పాలంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లీడర్? రీడర్? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాహుల్ గాంధీకి తెలంగాణ చరిత్ర తెలుసా?  అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్లే ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఎన్నికలంటే భయమని, కాంగ్రెస్ అధినేతగా ఉన్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా జోడో యాత్ర చేశారని విమర్శించారు. 

అయినా తెలంగాణలో 11 సార్లు అధికారమిస్తే.. కనీసం వ్యవసాయానికి సాగునీరు.. ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మీరు ఎన్ని డ్రామాలు చేసినా? ఎన్ని రోడ్డు షోలు చేసినా.. తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించి పెద్ద లీడర్లు  కావాలని భావిస్తున్నారా? ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని చోట్ల గెలుస్తుందో? ఎన్ని చోట్లలో డిపాజిట్లు కాపాడుకుంటుందో? వేచి చూద్దామంటూ సవాల్ విసిరారు.  బీఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయి లాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చారంటూ పెద్దవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదంటూ.. ఆ పార్టీలో సీఎం కుర్చీకి 10 మంది పోటీ పడుతున్నారని, అయినా ఆ పార్టీ ఢిల్లీ అధినేతల కను సైగలలో నడుస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని, వారి కంటున్న కలలను ప్రజలు బొంద పెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను భరించలేకనే కొందరు నేతలు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలోకి అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు. 

click me!