దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోటీ జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు.
కల్వకుర్తి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల నుండి కేసీఆర్ ఎంత సొమ్మును లూటీ చేశారో ఆ సొమ్మును ప్రజలకు పంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.బుధవారంనాడు కల్వకుర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక కుటుంబానికే మేలు జరిగిందన్నారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోటీ నడుస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలంతా కలగన్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యోగాలు, పదవులు అన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయని రాహుల్ గాంధీ విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.లక్షన్నర కోట్లతో కట్టిన ప్రాజెక్టు అప్పుడే బీటలు పడుతుందని రాహుల్ గాంధీ విమర్శించారు.
LIVE: Public Meeting | Vijayabheri Yatra | Kalwakurthy, Telangana https://t.co/BwBMGvcVD9
— Rahul Gandhi (@RahulGandhi)గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో భారీ ప్రాజెక్టులను నిర్మించిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన ప్రజలకు ఇళ్లు, భూములు ఇచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ధరణి పోర్టల్ తెచ్చి పేదల భూములను లాక్కొన్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.ధరణి పోర్టల్ ద్వారా 20 లక్షల మంది రైతుల భూములను లాక్కొన్నారన్నారు. అందుకే కేసీఆర్ ను పదవి నుండి దింపాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.
also read:కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం: కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వివేక్ వెంకటస్వామి
కేసీఆర్ వలే మోడీ కూడ మాయమాటలు చెప్పారన్నారు. నల్లధనం తెచ్చి రూ. 15 లక్షలు పేదల ఖాతాల్లో జమ చేస్తామన్న మోడీ హామీ నెరవేరిందా అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్రాభివృద్దిలో మహిళలు ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రం కోసం, కుటుంబం కోసం కష్టపడే మహిళలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు.
అందుకే మహిళలకు ప్రతి నెల రూ. 2500 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ పై బీజేపీ ప్రభుత్వం వెయ్యి రూపాయాలను పెంచిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ను రూ. 500లకే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.అంతేకాదు మహిళంతా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతి నెల రూ. 4 వేల పెన్షన్ అందిస్తామన్నారు.
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య అవగాహన ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ సర్కార్ తెచ్చిన ఎన్నో బిల్లులకు బీఆర్ఎస్ మద్దతును ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఎంఐఎం పోటీకి దిగుతుందన్నార. ఎంఐఎం పోటీ చేసి పరోక్షంగా బీజేపీకి సహకరిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేంద్రంలో కూడ అధికారాన్ని దక్కించుకోంటామన్నారు.