
భూ దస్త్రాలను డిజిటలైజ్ చేసి, భూ సమస్యలను సులువుగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ చాలా చోట్ల ఇబ్బంది పెడుతోంది. ఒకరి పేరుపై ఉండాల్సిన భూమి మరొకరి పేరుపైన ఉంటోంది. దీంతో అసలైన భూ యజమానులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో పాటు అసలైన పట్టాదారులు కలిగి ఉన్న భూములు కొన్ని నిషేదిత జాబితాలో చేరాయి. వీటిని తొలగించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి ఒక్క జిల్లాలకే పరిమితమైన సమస్యలు కావు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో ఇలాంటి సమస్యలే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఇలాంటి ధరణి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్క రంగారెడ్డి జిల్లాలో మాత్రం దీనికి పరిస్థితికి భిన్నంగా ఉంది. ఇక్కడకి వచ్చిన భూ ధరణి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయి. గత వారం రంగారెడ్డి జిల్లా ధరణి డేటా ను 125185 అప్లికేషన్లు వచ్చాయి. అయితే వాటిలోని 120518 అప్లికేషన్లను అప్పటికప్పుడే అధికారులు పరష్కరించారు. సగటున రోజుకు 100 అప్లికేషన్లు వస్తున్నాయి. దీంట్లో 90 దరఖాస్తులు గంటల వ్యవధిలోనే పరిష్కారం అవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో ఇలా ధరణి సమస్యలు వెంట వెంటనే పరిష్కారం కావడంలో ఆ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కృషి ఎంతో ఉంది. ధరణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ధరణి అధికారులను కలెక్టర్ పరుగులు పెట్టిస్తున్నారు. సామాన్య ప్రజలు ధరణి విషయమై ఎప్పుడు కలెక్టరేట్ కు వచ్చినా అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. దీనికి వచ్చే సమస్యలను నిరంతరం పర్యవేక్షించారు.
ఇలా అధికారులను పరుగులు పెట్టిస్తూ, సామాన్యులకు అందుబాటులో ఉండటం వల్ల ఇప్పటి వరకు అనేక ధరణి సమస్యలు పరిష్కారం అయ్యాయి. ధరణి నిషేధిత భూముల జాబితా ఇప్పటికే 90 శాతం దరఖాస్తులను కలెక్టర్ క్లియర్ చేయించారు. అందుకే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ధరణి పట్ల వ్యతిరేకత వెలిబుచ్చినా రంగారెడ్డి జిల్లాలో ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇందులో కలెక్టర్ కృషి ఎంతోగానో ఉంది. ధరణి విషయంలో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం చేసిన కృషిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా అభినందించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ధరణి సమస్యలు చాలా తక్కువగానే ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.