
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం వేస్తున్న అడుగులు చూస్తుంటే.. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీకి భారీ ప్రణాళికనే సిద్దం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో గత కొంతకాలం చోటుచేసుకుంటున్న పరిణామాలతో పాటు, నేడు ఢిల్లీలో జరిగిన టీఆర్‌ఎస్ నిరసన దీక్షలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రైతు సమస్యల అంశాన్ని ప్రస్తావించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ చూస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను, అవినీతి ఆరోపణలను బేస్ చేసుకుని మోదీ కేంద్రంలో అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నా హజారే ఉద్యమాన్ని బేస్ చేసుకుని.. పార్టీ స్థాపించి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. ఈ పంథాలోనే కేసీఆర్ కూడా రైతు సమస్యలను బేస్ చేసుకుని.. వారి మద్దతు కూడగట్టుకుని జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏడాదికి పైగా కేంద్రం తీసుకొచ్చిన వివాదస్పద సాగు చట్టాలపై పోరు సాగించిన రైతులు.. వాటిని వెనక్కి తీసుకునేలా విజయం సాధించారు. ఐక్యంగా ఉద్యమం చేసి కేంద్రం దిగివచ్చేలా చేశారు. దీంతో వారు ఒక సంఘటిత శక్తిగా మారారు. ఈ క్రమంలోనే వారి మద్దతు పొందడమే లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ప్రసంగించిన కేసీఆర్.. తెలంగాణలో రైతుల పరిస్థితిని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో.. తెలంగాణ వచ్చాక ఏ విధంగా తాము రైతుల అభివృద్ది కృషి చేశాననే విషయాన్ని చెప్పారు.
‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సాగు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణను కోట్లాడి సాధించుకున్నామని.. రాష్ట్ర సాధనలో వందలాది యువత బలిదానాలు చేసింది. ఉద్యమాల ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చింది. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించామని.. దేశవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతుంది. మోటార్, విద్యుత్ తీగలు, బోర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ప్రధాన మంత్రి మోదీ సొంత రాష్ట్రంలో కూడా విద్యుత్ కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు’’ అని చెప్పడం ద్వారా రైతుల అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామనే సంకేతం పంపారు.
అంతేకాకుండా తెలంగాణలో అభివృద్దితో పాటు, సంక్షేమం కూడా కొనసాగుతుందని కేసీఆర్ తెలియజేశారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చని.. కానీ రైతులతో పడొద్దని అన్నారు. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. దేశానికి అన్నం పెట్టడమే తెలంగాణ రైతు చేసిన తప్ప అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేసీఆర్.. రైతు సమస్యలపై తన చిత్తశుద్దిని చాటుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని ఆరోపించారు. కార్పొరేట్లకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే దుస్థితికి తీసుకొచ్చేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా తెలంగాణ బీజేపీ నేతలు.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి రైతులను తప్పుదోవ పట్టించారని వీడియోలను ప్రదర్శించారు.
టికాయత్ వెంటే ఉంటామని చెప్పడం ద్వారా..
రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ గతంలో హైదరాబాద్‌లో పర్యటించిన సమయంలో కేసీఆర్‌పై విమర్శలు చేశారు. అయితే రైతు సమస్యలను ప్రధాన అజెండాగా చేసుకన్న తనకు ఇది ముప్పుగా కలిగించే పరిణామంగా భావించిన కేసీఆర్ తెరవెనక మంత్రాగం సాగించినట్టుగా రాజకీయ వర్గాల చెబుతాయి. ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ సహాయంతో.. కేసీఆర్ రాకేష్ టికాయత్ సత్సబంధాలు ఏర్పరుచుకోగలిగారు. ఈ క్రమంలోనే రాకేష్ టికాయత్ కిందటి సారి కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయన నివాసానికి వచ్చి కలిశారు.
ఇక, తాజాగా టీఆర్‌ఎస్ నిర్వహించిన దీక్షలో పాల్గొని మద్దుతు తెలియజేశారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న డిమాండ్ సరైందేనన్న రాకేష్ టికాయత్.. రైతులు పండించిన మొత్తం పంటను సేకరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. మరోవైపు రాకేష్ టికాయత్‌పై కూడా కేంద్రం వ్యవహరించిన తీరు బాగోలేదని కేసీఆర్ అన్నారు. సాగు చట్టాలపై కేంద్రానికి వ్యతిరేకంగా.. రైతులకు అండగా అలుపెరగని పోరాటం చేసిన టికాయత్‌ను ఎన్నో రకాలుగా కేంద్రం అవమానించిందని కేసీఆర్ అన్నారు. టికాయత్‌ను దేశ ద్రోహి, ఉగ్రవాది అన్నారని చెప్పారు. తాము టికాయత్ వెంట ఉంటామచి చెప్పారు. ఈ రకమైన పరిణామాలు రైతుల దృష్టిలో కేసీఆర్ సానుకూల అభిప్రాయం కలిగేందుకు తోడ్పతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. .
ఇక, గత కొంతకాలంగా కూడా కేసీఆర్.. ఏళ్ల పాటుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను తాము.. బంగారు తెలంగాణగా మార్చమని చెబుతున్నారు. అంతేకాకుండా దేశాన్ని.. బంగారు భారత్‌గా మార్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు.
ఇలా.. ఓ వైపు రైతు సమస్యలపై కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడం చేస్తున్న కేసీఆర్.. మరోవైపు తాము వారికి ఏ విధమైన మేలు చేస్తున్నామనేది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైన పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్న కేసీఆర్.. తాను అనుకున్నది సాధిస్తాడో..? లేదో..? వేచి చూడాల్సి ఉంది.