కేసీఆర్ ఆదిపురుష్.. బీఆర్ఎస్‌పై వర్మ ఆసక్తికర ట్వీట్.. పొగిడిరా?, సెటైర్ వేశారా?..

By Sumanth KanukulaFirst Published Oct 5, 2022, 3:53 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన జాతీయ పార్టీపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. అయితే వర్మ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన జాతీయ పార్టీపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. అయితే వర్మ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘టీఆర్‌ఎస్‌ని బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా కేసీఆర్ ఆదిపురుష్ (మొదటి వ్యక్తి)  అయ్యారు. జాతీయ రాజకీయాలకు స్వాగతం’ అని వర్మ ట్వీట్ చేశారు. అయితే వర్మ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఈ ట్వీట్‌పై పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. మరికొందరు నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది.. ఇలా చెప్పడం ద్వారా కేసీఆర్‌ను పొగిడారా..? లేదా సెటైర్ వేశారా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఎందుకంటే.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ టీజర్‌ ఇటీవల విడుదల కాగా.. దానిపై భారీగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందూ దేవతలను దర్శకుడు ఓం రౌత్ తప్పుగా చూపించాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆదిపురుష్‌ అంటూ వర్మ ట్వీట్ చేయడంతో.. ఆయన ఏ ఉద్దేశంతో ఈ కామెంట్  చేశారనే చర్చ సాగుతుంది. 

ఇటీవల కూడా కేసీఆర్ కొత్త పార్టీపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ..  సినిమా నటుల్లా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని ట్వీట్ చేశారు. ‘‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 అడుగుజాడలను అనుసరించి.. టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్‌గా పాన్ ఇండియాగా వెళ్తుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ యాష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ లాగా కాకుండా కేసీఆర్ రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్’’ అని వర్మ పేర్కొన్నారు. శుభకాంక్షలు చెబుతున్నట్టుగా ఓ ఫ్లవర్ ఎమోజీని కూడా ట్వీట్‌లో ఉంచారు. 

 

By Making TRS into BRS , KCR became the AdiPurush (1stMan) to do it ..Welcome to NATIONAL POLITICS 💐

— Ram Gopal Varma (@RGVzoomin)


ఇదిలా ఉంటే.. ఇక, తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పు, ఎజెండాను కేసీఆర్.. పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా పాల్గొన్నారు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత వారు శుభాకాంక్షలు చెప్పారు. 

 

Future kudah adhipurush teaser Laney vuntadah itey

— Ravi Teja (@RaviTej19083395)

అలాగే సర్వసభ్య సమావేశంలో..  పార్టీ రాజ్యాంగానికి అవసరమైన సవరణలు కూడా చేశారు. పార్టీ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలతో కూడిన తీర్మానాన్ని.. పార్టీ ప్రతినిధి బృందం భారత ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. పార్టీ పేరును మార్చాలని.. జాతీయ పార్టీగా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తును కూడా సమర్పించనుంది. 

click me!