న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కు సర్ధార్ పటేల్ రోడ్డులో తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేయనున్నారు. పార్టీకి స్వంత భవన నిర్మాణం పూర్తైతే అద్దె భవనం నుండి స్వంత భవనానికి మారనున్నారు.
హైదరాబాద్:జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని మరింత త్వరగా నిర్మించాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు.ఢిల్లీలో టీఆర్ఎస్ కు భవనం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. వసంత్ విహార్ లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి 2021 సెప్టెంబర్ 2న తెలంగాణ సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. పార్టీ భవన నిర్మాణ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి.
అయితే జాతీయ పార్టీని కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. దీంతో ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశించనున్నందున ఢిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాటు అనివార్యంగా మారింది. దీంతో ఢిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అద్దె భవనంలో పార్టీ కార్యాలయం కొనసాగనుంది. పార్టీ కార్యాలయానికి సంబంధించి మరమ్మత్తు పనులు చేస్తున్నారు. వారం రోజుల్లో ఈ పనులు పూర్తి చేసిన తర్వాత ఇక్కడి నుండే బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ స్వంత భవన నిర్మాణ పనులు పూర్తైన తర్వాత అక్కడి నుండే పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
also read:తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలి: టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం కోసం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఇవాళ నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో టీఆర్ఎస్ పేరు మార్పు విషయమై ఏక వ్యాక్య తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశంలో చదివి విన్పించారు. ఈ సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ వంటి నేతలు కూడ హాజరయ్యారు.