చిగురుపాటి జయరాం హత్య కేసు: రాకేష్ రెడ్డి దోషిగా నిర్ధారణ

By narsimha lode  |  First Published Mar 6, 2023, 5:14 PM IST

పారిశ్రామికవేత్త  చిగురుపాటి జయరాం హత్య  కేసులో  ప్రధాన నిందితుడు  రాకేష్ రెడ్డికి  కోర్టు  శిక్షను ఖరారు చేసింది. 



హైదరాబాద్: ప్రముఖ  పారిశ్రామికవేత్త  చిగురుపాటి జయరాం  హత్య కేసులో  ప్రధాన నిందితుడు  రాకేష్ రెడ్డిని  దోషిగా   నాంపల్లి  కోర్టు  నిర్ధారించింది.   సోమవారంనాడు తీర్పును వెల్లడించింది.  ఈ కేసులో  11 మంది  నిందితులపై  కేసును కొట్టివేసింది  కోర్టు. 

2019  జనవరి 31వ తేదీన   పారిశ్రామికవేత్త  చిగురుపాటి జయరాంను   రాకేష్ రెడ్డి హత్య  చేశాడు.  హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే  ఉన్న కారులో  జయరాం  మృతదేహన్ని   రాకేష్ రెడ్డి  వదిలివెళ్లాడు .  రాకేష్ రెడ్డి  కుట్ర చేసి హత్య చేశాడని  కోర్టు  నిర్ధారించింది.  ఈ నెల  9వ తేదీన  రాకేష్ రెడ్డికి  శిక్షను ఖరారు చేయనుంది  కోర్టు .

Latest Videos

ఈ కేసులో  అన్ని రకాల  టెక్నికల్  ఆధారాలను  కోర్టు  ముందు  ఉంచినట్టుగా  ప్రభుత్వ తరపు న్యాయవాదులు  మీడియాకు  చెప్పారు.  సుమారు  40 రోజులకు పైగా  కోర్టులో వాదనలు  విన్పించినట్టుగా  న్యాయవాదులు  చెప్పారు.  అయితే  ఈ కేసులో  రాకేష్ రెడ్డి ఒక్కరినే  దోషిగా  కోర్టు నిర్ధారించింది. 

also read:పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య: మార్చి 6వ తేదీకి తీర్పు వాయిదా

పారిశ్రామికవేత్త  జయరాంను  హనీట్రాప్ ద్వారా  రాకేష్ రెడ్డి  హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని  తన ఇంటికి రప్పించుకున్నాడు.  తన ఇంట్లోనే  జయరాంను  నిర్భంధించి  రాకేష్ రెడ్డి హత్య చేశాడు.  జయరాంను  హత్య  చేసిన తర్వాత  ఈ కేసు నుండి  తప్పించుకొనేందుకు  రాకేష్ రెడ్డి  కొందరు పోలీసుల సలహలను కూడా  తీసుకున్నారని  అప్పట్లో  విచారణ నిర్వహించిన  అధికారులు  గుర్తించారు. పోలీస్ అధికారులతో  రాకేష్ రెడ్డి  సంభాషణలను కూడా  కోర్టుకు  సమర్పించినట్టుగా  ప్రభుత్వ తరపు న్యాయవాది  మీడియాకు  చెప్పారు. 

 విజయవాడకు  సమీపంలోని  నందిగామ సమీపంలో  జాతీయ రహదారి పక్కనే  కారులో  జయరాం డెడ్ బాడీని ఉంచి  రాకేష్ రెడ్డి  పారిపోయాడు.  జయరాంను డబ్బుల  కోసం  రాకేష్ రెడ్డి చిత్రహింసలకు గురి చేశాడు.  రాకేష్ రెడ్డి దెబ్బలకు తాళలేక  జయరాం మృతి చెందాడని పోలీసులు తమ విచారణలో అప్పట్లో గుర్తించారు. 

ఈ సమయంలో   అక్కడే ఉన్న  నిందితులు  వీడియోలు, ఫోటోలు తీశారు.   ఈ ఫోటోలు, వీడియోలను కూడా   కోర్టుకు సమర్పించారు  పోలీసులు.  ఈ  కేసు తీర్పు  పూర్తి పాఠం  చూసిన తర్వాత  ఏం చేయాలనే దానిపై  నిర్ణయం తీసుకుంటామని  ప్రభుత్వ  న్యాయవాదులు  చెప్పారు.  

click me!