
TSRTC Bill: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు రెండు రోజులుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వద్ద పెండింగ్‌లో ఉన్నది. అయితే, ఈ బిల్లుపై కొన్ని వివరణలు కావాలని రాజ్‌భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించారు. ఈ వివరణలు ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అడిగినట్టు రాజ్‌భవన్ తెలిపింది. అయితే, ఈ బిల్లును ఆమోదించడానికి గవర్నర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తాము కోరిన వివరణలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానాలు ఇస్తే.. బిల్లుపై ఆమోదానికి సంబంధించిన నిర్ణయం అంతే వేగంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని రాజ్‌భవన్ వెల్లడించింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన చేసే బిల్లు మనీ బిల్లు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గవర్నర్ సౌందరరాజన్‌కు పంపించారు. రెండు రోజుల క్రితమే ఈ బిల్లును పంపించారు. అయితే.. దీనిపై గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపలేదు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉన్నది.
Also Read: TSRTC: రేపు ఆర్టీసీ బస్సుల బంద్, విలీన బిల్లుకు ఆమోదం తెలుపని గవర్నర్ తమిళిసై
అసెంబ్లీ సమావేశాలు గురువారం మొదలైన సంగతి తెలిసిందే. మూడు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆదివారం సమావేశాలు ముగియనున్నాయి. దీంతో ఆర్టీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటంపై ఆర్టీసీ కార్మికుల్లోనూ ఆందోళన మొదలైంది. అందుకే రేపు రాష్ట్రవ్యాప్తంగా రెండు గంటలపాటు బస్సు బంద్‌కు పిలుపు ఇచ్చారు. అవసరమైతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామనీ టీఎంయూ హెచ్చరించింది.