అన్నదాతలకు శుభవార్త... నాలుగురోజుల తర్వాత తెలంగాణలో విస్తారంగా వర్షాలు

By Arun Kumar PFirst Published Aug 12, 2021, 9:48 AM IST
Highlights

వర్షాలు ముఖం చాటేయడంతో ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి వర్షాలు తిరిగి రానున్నట్లు తెలిపారు. 

హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం తెలంగాణను ముంచెత్తిన వర్షాలు ఇప్పుడ ముఖం చాటేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు హిమాలయాలవైపు పయనమవడం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో  ద్రోణులు, అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలేవీ ఏర్పడక పోవడమే వర్షాలు కురవకపోవడానికి, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. 

దక్షిణ భారతదేశంలో కొద్దిరోజులు ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా వున్నాయని... తెలంగాణలో చాలాప్రాంతాల్లో సాధారణం కంటే 3నుంచి 4డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి మరో నాలుగు రోజులు వుంటుందని ఆమె తెలిపారు. అయితే ఈ నెల 16న ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని... దీని ప్రభావంతో 16, 17, 18తేదీలలో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు  తెలిపారు.

వర్షాకాలం ఆరంభంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తీరా పంటకు నీరు అవసరమైన సమయంలో వర్షాలు కురవడం లేదు. ఇది చాలదన్నట్లు ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. దీంతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వర్షాల కోసం పూజలు చేయడం కూడా  ప్రారంభించారు.  

read more  విచిత్రం : వర్షాలు కురవాలని.. మద్యం,మాంసం నైవేద్యం..గుళ్లోనే తాగి,తినే సంప్రదాయం...

అయితే రైతుల ఆందోళనను తగ్గించే చల్లని వార్తను హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగస్ట్ 16నుండి వర్షాలు కురవనున్నాయని... దీంతో ఉష్షోగ్రతలు కూడా తగ్గుతాయని తెలిపింది. హైదరాబాద్ తో రాష్ట్రవ్యాప్తంగా ఉక్కపోత కూడా తగ్గనుందని వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు. 

రాష్ట్రంలో వర్షాలు లేకున్నా ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 5,04,086 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50 అడుగులకు వరద చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. జలాశయంలో 207.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి జలాశయానికి వరద వస్తుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.  

అటు నాగార్జున సాగర్‌ జలాశయం ఇన్‌ఫ్లో 4,14,526 క్యూసెక్కులు ఉండగా.. 36,572 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయంలో ప్రస్తుతం 579.20 అడుగులు మేర నీరు చేరింది. జలాశయంలో గరిష్ఠ నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం 280.69 టీఎంసీల నిల్వ ఉంది. సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సాగు కోసం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపీ లింగయ్య, ఎమ్మెల్యే నోముల భగత్‌ ఎడమ కాల్వకు గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గంట గంటకు జలాశయంలోకి వరద ఉద్ధృతి పెరుగతున్నందున సాగర్‌ గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.  

ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కి 35,526 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజ్‌ 36 గేట్లు అడుగు మేర ఎత్తి 26,892 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాటిలో 8,634 క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌ నుంచి కాలువలకు వదులుతున్నారు.  
 


 

click me!