బలపడిన వాయుగుండం... మరో రెండురోజులు తెలంగాణలో వర్షాలు

By Arun Kumar PFirst Published Sep 14, 2021, 9:41 AM IST
Highlights

తెలంగాణలో మరో రెండురోజులు(మంగళ,బుధవారం) వర్షాలు కొనసాగే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రరూపం దాల్చిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పశ్చిమ భారతం నుండి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వెల్లడించారు.  వీటి ప్రభావంతో తెలంగాణలో ఈ రెండురోజులు (మంగళ, బుధవారాలు)  మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు నాగరత్న తెలిపారు.  

ఇక గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  

తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు, చెరువులు నిండాయి. వరద ప్రవాహం జనవాసాలను ముంచెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ఇటీవల సిరిసిల్ల పట్టణం నీట మునిగింది. వరద నీటిలో కార్లు, మోటార్ బైక్ లు కొట్టుకుపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగిత్యాలలో లో లెవల్ వంతెన పై నుండి వరద నీరు ప్రవహించింది.  వర్ధన్నపేటలోని ఆలేరు వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహించింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించింది. హుస్నాబాద్ లోని ప్రధాన రహదారిపై వరద నీరు చేరి ప్రధాన వీధులన్నీ నీట మునిగిపోయాయి.  

రాజధాని హైదరాబాద్ నగరాన్ని కూడా ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాల దాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహించింది. ఇక వరద నీరు లోతట్టు ప్రాంతాల కాలనీలను ముంచెత్తింది. ఇలా ఇటీవల కురిసన భారీ వర్షాలకు యావత్ తెలంగాణ తడిసిముద్దయింది. 
 

click me!