
Weather : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ (మే 2 , శుక్రవారం) ఎండావాన పరిస్థితి ఉండనుంది. మరో ఏడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
గురువారం సాయంత్రం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురిసింది. మధ్యాహ్నంవరకు ఎండ మండిపోగా సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఇదే పరిస్థితి ఇవాళ కూడా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణలో మరో నాల్గోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వికారాబాద్, నారాయణపేట, గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, జనగాం, భువనగిరి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండ, కొత్తగూడెం జిల్లాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఎండలు మండిపోయి సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుంది.... ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూల్, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వానలతో పాటు కొన్ని జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. గురువారం ప్రకాశం, కడప, అన్నమయ్య జల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇవాళ కూడా ఇదేస్థాయిలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.