నాపై 24 కేసులు, కేసీఆర్ అవినీతిపై ఎందుకు నోరు మెదపరు: బీజేపీ, బీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

By narsimha lodeFirst Published Oct 19, 2023, 12:17 PM IST
Highlights

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.  కాటారంలో నిర్వహించిన సభలో  రాహుల్ గాంధీ ప్రసంగించారు.

కాటారం: తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాటారంలో  గురువారం నాడు ఉదయం జరిగిన  సభలో  కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇవాళ ఉదయం  భూపాలపల్లి నుండి కాటారం వరకు బస్సులో  రాహుల్ గాంధీ చేరుకున్నారు. రెండో రోజూ  కాంగ్రెస్ బస్సు యాత్ర ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఇవాళ రాత్రికి రాహుల్ గాంధీ కరీంనగర్ లో బస చేస్తారు.

కేసీఆర్ అవినీతిపై  ఎందుకు  దర్యాప్తు చేయడం లేదని బీజేపీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.  కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు ఫోకస్  పెట్టలేదని ఆయన  అడిగారు.

 కేసీఆర్ తన అవినీతిని పక్క రాష్ట్రాలకు కూడ విస్తరించారని ఆయన ఆరోపించారు.దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉందని  రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ పై  ఎలాంటి చర్యలు లేవన్నారు. కానీ తనపై  బీజేపీ సర్కార్ ఇరవైకి పైగా కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు.మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్  ఓటమి ఖాయంగా కన్పిస్తుందన్నారు.   దొరల తెలంగాణకు , ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం సాగుతుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరమౌతూ వస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణలో  కుటుంబ పాలన సాగుతుందని  రాహుల్ గాంధీ విమర్శించారు. 

బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.  బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయన్నారు. బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే  ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్ధులను బరిలో నిలిపి బీజేపీకి సహకరిస్తుందని ఆయన  విమర్శించారు. బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దేశంలో పెద్ద అంశం కులాల వారీగా జనగణన అని ఆయన పేర్కొన్నారు. కులగణన చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు.ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడ అడిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్ ను నియంత్రిస్తున్నారని ఆయన చెప్పారు.అందరిని  పాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

90 మంది కీలక అధికారుల్లో ఎంతమంది బీసీలున్నారని తాను పార్లమెంట్ లో అడిగినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ అధికారులు ఎంతమంది ఉన్నారని కూడ తాను పార్లమెంట్ లో లేవనెత్తినట్టుగా రాహుల్ తెలిపారు.రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను  కులగణన చేయాలని ఆదేశించినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు.

also read:భూపాలపల్లిలో రాహుల్ గాంధీ: నిరుద్యోగులతో బైక్ ర్యాలీ

అదానీ లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారన్నారు.అదానీ తీసుకున్న అప్పులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాఫీ చేసిందన్నారు. స్వయం ఉపాధి కోసం మహిళలు తీసుకున్న అప్పులను మాత్రం బీజేపీ సర్కార్ మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు.ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువులపై  జీఎస్టీ పేరుతో పన్ను వసూలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజల నుండి వసూలు చేసిన పన్నులను అదానీకి కట్టబెడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.కర్ణాటకలో రైతులకు రుణమాఫీ  చేసినట్టుగా  రాహుల్ గాంధీ చెప్పారు.కర్ణాటకలో మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు.

click me!