స్వదేశంనుంచి విదేశాలకు బంగారాన్ని ఎగుమతి చేస్తూ ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. అతని దగ్గరినుంచి దాదాపు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టు పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడు శ్రీరంగప్ప దగ్గర కిలోన్నర అక్రమ బంగారం పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా శ్రీ రంగప్ప లగేజ్ ని సిఐఎస్ఎఫ్ అధికారులు స్క్రీనింగ్ చేశారు.
అతని లగేజీలో కిలోనర బంగారం బిస్కెట్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ… నిందితుడిని కస్టమ్స్ కి అప్పజెప్పారు. విదేశాలనుంచి స్వదేశానికి బంగారాన్ని తరలించడం ఎప్పుడూ కనిపిస్తుండేదే. కానీ ఈ కేసులో మొదటిసారిగా స్వదేశం నుంచి బంగారాన్ని విదేశాలకి అక్రమ రవాణా చేయడం గమనార్హం.
శంషాబాద్ ఎయిర్పోర్టు చరిత్రలోనే ఇలా స్వదేశాల నుంచి విదేశాలకు అక్రమ బంగారం తరలిస్తూ పట్టుబడడం మొదటి సారి కావడం చర్చనీయాంశంగా మారింది. మామూలుగా దుబాయ్, షార్జా, నుంచి అక్రమ బంగారం రవాణా జరుగుతుంటుంది. అనేకసార్లు అధికారులు.. ఈ బంగారాన్ని పట్టుకుంటారు. కానీ, మొట్టమొదటిసారిగా ఇండియా నుంచి విదేశాలకు అక్రమ బంగారం తరలించడం.. ఈ ప్రయత్నంలో పట్టుబడడం విశేషం.