గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది..: కాంగ్రెస్ బస్సు యాత్రపై కేటీఆర్ ఫైర్..

By Sumanth Kanukula  |  First Published Oct 19, 2023, 11:21 AM IST

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల వేళ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చేపట్టిన బస్సు యాత్రపై బీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల వేళ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చేపట్టిన బస్సు యాత్రపై బీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. విభజన హామీలపై ఏనాడూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించని రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని విమర్శించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని.. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆరోపించారు. తమ ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందని.. వారి గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోందని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో కేటీఆర్ పోస్టు చేశారు. 

గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని అడిగారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని అన్నారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణలో మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం తమది అని అన్నారు. 

Latest Videos

కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని.. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన తమది అని అన్నారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెరదీస్తే నమ్మేదెవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే కరప్షన్‌కు కేరాఫ్ అని ఆరోపించారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని.. అలాంటిది ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ? అని ప్రశ్నించారు. 

దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని... ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం తమదని అన్నారు. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్‌కు.. ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. 
వందల మంది బలిదానాలకు కారణమని అన్నారు. నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్ అని విమర్శించారు. 

అదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందని విమర్శించారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్.. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు... రేవంత్ అని ఆరోపించారు. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది అని ప్రశ్నించారు. రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ కాంగ్రెస్ టెన్ జనపథ్ అని ప్రశ్నించారు. 

‘‘మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది.. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా... తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు.  వైఫల్యాల కాంగ్రెస్‌ను ఎప్పటికీ విశ్వసించరు..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 

click me!