పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరిని సోమవారంనాడు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 9 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్: పెళ్లి బృందం ముసుగులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరిని సోమవారంనాడు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 15 కిలోల డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 9 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
సోమవారంనాడు మధ్యాహ్నం తన కార్యాలయంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ఈ డ్రగ్స్ ముఠా గురించి సీపీ మహేష్ భగవత్ వివరించారు. చెన్నై నుండి హైద్రాబాద్ కు ఈ ముఠా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని సీపీ తెలిపారు. పెళ్లి బృందం పేరుతో డ్రగ్స్ ను తరలిస్తున్న విషయమై సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. పెళ్లికి అవసరమైన వస్తువులను చెన్నై నుండి హైద్రాబాద్ కు తరలిస్తున్నట్టుగా సీపీ మహేష్ భగవత్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని తలపెట్టారు. డ్రగ్స్ తో పాటు గంజటాయిని సరపరా చేసేవారిపై ఎక్సైజ్, పోలీసు శాఖ నిఘాను తీవ్రం చేశాయి. హైద్రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ సరఫరా చేసే వారిలో కీలకమైన వారిని అరెస్ట్ చేశారు. ముంబైలో టోనిని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు హైద్రాబాద్ పోలీసులు. డ్రగ్స్ కొనుగోలు చేసే వారిపై కూడా హైద్రాబాద్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
రాజస్థాన్ నుండి డ్రగ్స్ ను తెచ్చి హైద్రాబాద్ లో విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఈ ఏడాది నవంబర్ 30న రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ కు గోవా నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఎడ్విన్ ను గత నెలలో హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు బెయిల్ లభించింది. ఎడ్విన్ తో కలిసి బాలమురుగన్ ను నవంబర్ 29న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.