పీసీసీ కమిటీల నియామకంలో నాకు సమాచారం లేదు: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

By narsimha lodeFirst Published Dec 12, 2022, 6:56 PM IST
Highlights


పీసీసీ కమిటీల నియామకం విషయంలో  తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.  ఈ కమిటీల్లో  సామాజిక సమతుల్యత కూడా లేదన్నారు.ఈ విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా ఆయన చెప్పారు. 
 

హైదరాబాద్:పీసీసీ కమిటీల నియామకం విషయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారుసోమవారంనాడు సాయంత్రం  తన నివాసంలో  సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.. ఈ కమిటీల్లో సీనియర్లకు చోటు దక్కలేదన్నారు. అంతేకాదు సామాజిక సమతుల్యత కూడా పాటించలేదని  మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా భట్టి విక్రమార్క తెలిపారు.  కమిటీల్లో  చోటు దక్కనివారు తనకు  సమాచారం ఇస్తున్నారన్నారు. ఓయూ విద్యార్ధులు , అన్ని జిల్లాలకు చెందిన కొందరు  నేతలు ఈ విషయాలపై తనతో ఫోన్లో మాట్లాడినట్టుగా భట్టి విక్రమార్క వివరించారు. బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు  కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తే బాగుండేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదన్నారు. 

కమిటీల  కూర్పు  విషయమై పీసీసీ, సీఎల్పీ చర్చించి నిర్ణయం తీసుకొనే సంప్రదాయం ఉండేదన్నారు. కానీ, ఈ దఫా మాత్రం తనకు  ఈ కమిటీ ఏర్పాటు విషయమై ఎలాంటి సమాచారం లేదని భట్టి విక్రమార్క చెప్పారు.  ఇలా ఎందుకు జరిగిందో తనకు తెలియదన్నారు. కమిటీలో ఏ జిల్లా నుండి ఎవరిని తీసుకుంటున్నారో సమాచారం ఇస్తే తాను కూడా  సలహాలు, సూచనలు ఇచ్చేవాడినన్నారు.

ఇవాళ మధ్యాహ్నం  కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.  మాజీ మంత్రి కోదండరెడ్డి,  వి.హనుమంతరావు,  మధు యాష్కీ,  మహేశ్వర్ రెడ్డి  తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీసీ కమిటీల్లో జిల్లాల వారీగా నేతలకు ఏ మేరకు ప్రాధాన్యత దక్కిందనే విషయమై చర్చించారు. ఇప్పటికే  మాజీ మంత్రి కొండా సురేఖ పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు.  సీనియర్ అధికార ప్రతినిధి పదవికి  బెల్లయ్య నాయక్ రాజీనామాలు సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన  కొందరు కాంగ్రెస్ నేతలు  అసంతృప్తితో  ఉన్నారు. కమిటీల్లో చోటు దక్కని కొందరు నేతలు  రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి  మాట్లాడనున్నారు. 

also read:భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్: త్వరలోనే కలుద్దామన్న సీఎల్పీ నేత

పీసీసీ కమిటీల్లో చోటు దక్కని నేతలు రోజుకొకరు చొప్పున  తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.  ఈ కమిటీల కూర్పు వెనుక తన ప్రమేయం లేదని  మల్లుభట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.ఈ కమిటీల కూర్పు  విషయంలో తనను పార్టీ నాయకత్వం సంప్రదించలేదనే అసంతృప్తిని భట్టి విక్రమార్క వ్యక్తం చేశారు. గతంలోని సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారని  విక్రమార్క చెప్పారు.  ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని మాణికం ఠాగూర్ చెప్పాలన్నారు. తాను 1990 నుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న విషయాన్ని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో తనకు సంబంధాలున్న విషయాన్ని భట్టి విక్రమార్క తెలిపారు. 
 

click me!