అధికారంలోకి వస్తే మంత్రులు, సీఎం అయ్యేది మేం కాదు.. టీ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ క్లాస్..!!

Published : Aug 06, 2023, 09:37 AM IST
అధికారంలోకి వస్తే మంత్రులు, సీఎం అయ్యేది మేం కాదు.. టీ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ క్లాస్..!!

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం శనివారం రోజున గాంధీ భవన్‌లో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా హాజరయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం శనివారం రోజున గాంధీ భవన్‌లో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీ వేణు గోపాల్.. తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం వచ్చే 100 రోజుల పాటు అన్ని విబేధాలు వీడి ఐక్యంగా పని చేయాలని నేతలకు సూచించారు. ఎన్నికలు సమీపిస్తుంటే..  పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, ఇంకా కొట్లాడుకుంటుంటే ఎలా అని ప్రశ్నించారు. 

పార్టీ నేతలు అందరూ అన్ని అంశాలను పక్కన పెట్టి కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలను ఆదర్శంగా తీసుకుని.. 100 రోజులు ఐక్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అదే సమయంలో టీ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాము ఇక్కడకు వచ్చి మంత్రులు అయ్యేది ఏమీ లేదని.. కష్టపడి పార్టీని గెలిపిస్తే మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేది మీరేనని.. టీ కాంగ్రెస్ నేతలు కలిసి ముందుకు సాగాలని హితవు పలికారు. 

అయితే వివిధ కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అవగాహన లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి వంటి నేతలు ప్రస్తావించగా.. పార్టీలోని ఇతర నేతలతో ఉన్న విభేదాలను నాయకులు పూడ్చుకోవాల్సిన అవసరం ఉందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

అయితే ఈ భేటీ సందర్భంగా కేసీ వేణుగోపాల్ సమక్షంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య కొంత వాగ్వాదం జరిగినట్టుగా సమాచారం. పార్టీ మండల కమిటీలకు సంబంధించి ఏ జిల్లా నాయకుడు ఆ జిల్లాను చూసుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. పార్టీ కమిటీల ఏర్పాటు ఏకపక్షంగా ఉంటే ఎలా అని ఉత్తమ్ సహా మరికొందరు సీనియర్ నేతలు ప్రశ్నించారు. దీనిపై రేవంత్‌ స్పందిస్తూ అన్ని జిల్లాల్లోనూ కలుగజేసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. 

ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. పక్క జిల్లాల్లో తమకూ అనుచరులు ఉంటారని, తాము ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నామనని, పీసీసీ చీఫ్‌గా పార్టీని  నడిపించానని, కొత్తగా వచ్చిన వారు తమపై పెత్తనం చేస్తే ఎలా? అని అన్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా వచ్చిన వాళ్లు నిర్ణయాలు తీసుకుంటుంటే తాము పట్టించుకోకుండా ఎలా ఉంటామని కూడా ప్రశ్నించారు. అంతేకాదు తమను కలుపుకొని వెళ్లడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సమావేశం కొంత వాడి వేడిగా మారింది. ఇక, మండల స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ అత్యవసరమని కొందరు నాయకులు చెప్పారు. 

ఇక, అన్ని పార్టీలు బీసీలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పట్టుబట్టినట్లు సమాచారం. 

ఇదిలాఉంటే,  ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పలు వర్గాలకు డిక్లరేషన్‌లు ప్రకటించడం కోసం ఆరు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నేతలు పీఏసీ భేటీలో నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ సభలకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్యలను ఆహ్వానించాలని, సమయాన్నిబట్టి ఒక్కో సభకు ఒక్కో జాతీయ నేతను తీసుకురావాలని, రాహుల్‌ వీలైనన్ని సభలకు వచ్చేలా చూడాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 

ఈ భేటీ తర్వాత పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ప్రచారంలో కర్ణాటక తరహాలో మేము కూడా నడుచుకోవాలని కేసీ వేణుగోపాల్‌ ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాలపై చార్జిషీట్‌ దాఖలు చేస్తాం. నాలుగు బహిరంగ సభలు నిర్వహిస్తాం. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు జహీరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభలకు ఒక్కో సీనియర్ నాయకులు హాజరవుతారు’’ అని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ