హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్ మీద టీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే?

By telugu teamFirst Published Jun 25, 2021, 3:33 PM IST
Highlights

హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ఈటల రాజేందర్ ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ తన అభ్యర్థిపై ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతోంది.

హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి, ఈటల రాజేందర్ బిజెపిలో చేరారు. బిజెపిలో చేరిన మరుక్షణం నుంచే ఆయన హుజూరాబాద్ లో ప్రచారం ప్రారంభించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి జమున కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

కాగా, టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి వేటలో ఉంది. హుజూర్ నగర్ లోని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేజారకుండా ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ, సరైన అభ్యర్థి కేసీఆర్ దృష్టికి రావడం లేదని అంటున్నారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ మీద పోటీ చేస్తారని అనుకున్నారు. కౌశిక్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్నారు. ఈటల రాజేందర్ మీద ఆయన మాటల యుద్ధం చేస్తున్నారు.

కాగా, ఇటీవల కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. కశ్యప్ రెడ్డిని ఈటల రాజేందర్ మీద పోటీకి దించుతారా అనే ప్రశ్న కూడా ఉదయించింది. అయితే, తాజాగా కేసీఆర్ మదిలోకి మరో వ్యక్తి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వేములవాడ ఆలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్న ముద్దసాని పురుషోత్తమ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా పోటీకి దించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. 

పురుషోత్తమ రెడ్డి రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. ఆయన నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. కేసీఆర్ మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు ఆ జిల్లా కలెక్టర్ గా ముద్దసాని పురుషోత్తమ రెడ్డే ఉన్నారు. దాంతో కేసీఆర్ వ్యక్తిగతంగా కూడా పురుషోత్తమ రెడ్డితో సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. 

పురుషోత్తమ రెడ్డి సోదరుడు ముద్దసాని దామోదర్ రెడ్డి నాలుగు సార్లు కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు స్థానికంగా మంచి పేరు ఉంది. దీంతో పురుషోత్తమ రెడ్డిని దింపితే అది తమకు కలిసి వస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ మీద సానుభూతి ఉందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సానుభూతిని ఎదుర్కోవడానికి పురుషోత్తమ రెడ్డి అయితేనే పనికి వస్తారని ఆలోచిస్తున్నారు. పురుషోత్తమ రెడ్డిని పోటీకి దింపి కేసీఆర్ ఒకటి, రెండు సార్లు వచ్చి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటే ఈటల రాజేందర్ ను ఓడించడానికి వీలవుతుందని వారు అంచనా వేస్తున్నారు. 

click me!