తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన చర్యల గురించి పరిశీలించేందుకు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇవాళ పర్యటిస్తున్నారు.
మెదక్: సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను గురువారం నాడు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పరిశీలించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ బుధవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ కు వచ్చారు. సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు నీటి పారుదల ప్రాజెక్టులను భగవంత్ సింగ్ మాన్ పరిశీలించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ రిజర్వాయర్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఎర్రవెల్లి వద్ద చెక్ డ్యామ్ లను కూడా భగవంత్ సింగ్ మాన్ పరిశీలించనున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పాండవుల చెరువును కూడా భగవంత్ సింగ్ మాన్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
ఇటీవలనే ఖమ్మం జిల్లా కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ సిం్ మాన్ పాల్గొన్న విషయం తెలిసిందే. కంటి వెలుగు కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ తరహ కార్యక్రమాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని పంజాబ్ సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాల అభివృద్ది కోసం తీసుకున్న చర్యలను పరిశీలించాలని రెండు పర్యటనకు భగవంత్ సిం్ మాన్ తెలంగాణకు వచ్చారు .
ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్ ల నిర్మాణం వంటి వాటిని భగవంత్ సింగ్ మాన్ పరిశీలిస్తారు. ఈ విషయమై భగవంత్ సింగ్ మాన్ తెలంగాణ నీటి పారుదల శాఖాధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాల ద్వారా ఏ మేరకు భూగర్భ జలాలు పెరిగాయనే విషయంపై కూడా పంజాబ్ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.