
బంజారాహిల్స్‌లో పుడింగ్ అండ్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ ఉప్పాలకు బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు అభిషేక్‌కు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న పబ్ మేనేజర్ అనిల్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇక, గత నెలలో బంజారాహిల్స్‌లో పుడింగ్ అండ్ పబ్‌లో డ్రగ్స్ లభించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అనిల్, అభిషేక్‌లు నిందితులుగా ఉన్నారు. వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు కేవలం అభిషేక్‌కు మాత్రమే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాలకు ఓ మారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టాలని ఆయనకు కోర్టు షరతు విధించింది.
ఈ కేసులో ఏ1గా పబ్ మేనేజర్ అనిల్‌ను, ఏ2గా అభిషేక్‌ను చేర్చిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలంటూ వారు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో అభిషేక్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.
ఇక, బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై గత నెల ఆకస్మికంగా దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదు గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో పట్టుబడినవారిని విచారణ అనంతరం పోలీసులు వదిలిపెట్టారు. దాడి సమయంలో పబ్‌లో సిబ్బందితో సహా 148 మంది ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. పబ్‌లో జరిగిన లేట్ నైట్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు బంధువులు, వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నారు.
ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. పోలీసులు దాడి సమయంలో పోలీసులు ఒక డిస్క్ జాకీ పాటలు ప్లే చేస్తుండగా.. కస్టమర్లు డ్యాన్స్ చేస్తూ కనిపించారని చెప్పారు. అక్కడి టేబుల్‌పై వివిధ రకాల ఆకులు, ఇతర పదార్థాలు కూడా కనుగొనబడ్డాయని చెప్పారు. సోదాల్లో కొకైన్ దొరికిందని వెల్లడించారు. కస్టమర్లందరూ డ్రగ్స్ వాడినట్లు తెలియకపోవడంతో వారిని నిందితులుగా చేయలేదని జోయెల్ చెప్పారు.
పబ్‌లోకి వెళ్లడానికి కోడ్ లాంగ్వేజ్ వినియోగించేవారని.. కోడ్ చెప్పినవాళ్లకే పబ్‌లోకి అనుమతిస్తున్నారని డీసీపీ చెప్పారు. పబ్‌కి వచ్చే వారికి ఓటీపీ ఇచ్చి.. దాని ద్వారానే ఎంట్రీ ఇస్తున్నారని డేవిస్ తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే వారిని అదుపులోకి తీసుకుంటామని జోయల్ డేవిస్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.