
హైదరాబాద్ నగరంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఇండియా ఏవియేషన్ (wings india aviation show) షోను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్ షోను కేంద్ర పౌర విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మార్చి 24న ప్రారంభమైన ఈ షో నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ ప్రదర్శనలో తొలి రెండు రోజులు వ్యాపార వర్గాలకు ప్రవేశం కల్పించారు.చివరి 2 రోజులు సాధారణ ప్రజలను ఏవియేషన్ షో చూసేందుకు అనుమతిస్తారు. అయితే ఇందుకోసం వారు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే శనివారం ఏవియేషన్ షోలో గందరగోళం చోటుచేసుకుంది.
ఏవియేషన్ షో చూసేందుకు వచ్చిన సందర్శకులు ఆందోళనకు దిగారు. ఏవియేషన్ షో సందర్శనకు జనాల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 600 వసూలు చేసిన నిర్వాహకులు కనీస ఏర్పాట్లు చేయలేదు. సందర్శకులను బారికేడ్స్ వరకే అనుమతించడంతో.. మండుటెండల్లో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు ఏవియేషన్ షో చూపిద్దామని తీసుకొచ్చిన తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. మరోవైపు ఏవియేషన్ ఫుడ్ కోర్టులో అధిక ధరలకు విక్రయాలు జరపడంతో.. ఏం కొనుగోలు చేసేట్టుగా లేదని సందర్శకులు వాపోతున్నారు.
ఇక, ఈ ఎయిర్ షోలో ఎయిర్ బస్, ప్రాట్ అండ్ విట్నీ వంటి ప్రఖ్యాత విమాన తయారీ కంపెనీలు, విమాన ఇంజిన్ తయారీ సంస్థలు పాల్గొన్నాయి. ఎయిర్ బస్ కొత్త విమానం ఎయిర్ బస్-350 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.