భార్య వదిలేయడంతో కక్ష, ఒంటరి మహిళలు టార్గెట్: 17 హత్యలు, సైకో అరెస్టు

By telugu teamFirst Published Jan 26, 2021, 4:08 PM IST
Highlights

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు చేస్తూ వస్తున్న సైకో కిల్లర్ రాములను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇప్పటి వరకు 17 హత్యలు చేసినట్లు గుర్తించారు.

హైదరాబాద్: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్న సైకో రాములును హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. సైకో రాములు 17 హత్యలు, 5 దోపిడీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైకో రాములును అరెస్టు చేసిన విషయాన్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. 

భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని, దాంతో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నాడని ఆయన చెప్పారు. 2011లో ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి నుంచి రాములు పారిపోయాడు. సంగారెడ్డి జిల్లా కంది మండలం అరుట్ల గ్రామానికి చెందిన రాములుపై పలు కేసులు నమోదయ్యాయి. 

ఆస్పత్రి నుంచి పారిపోయి మళ్లీ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ రాములను హైదరాబాదు నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు.  ఒంటరిగా ఉన్న మహిళలను తన మాయమాటలతో నమ్మించి శివారులోకి తీసుకుని వెళ్లి అత్యంత కిరాతకంగా చంపుతూ వచ్చాడు. 

ఈ నెల మొదటివారంలో హైదరాబాదు శివారులోని అంకుషాపూర్ సమీపంలో సగం కాలిన మహిళ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయితే, మృతురాలికి సంబంధించిన ఏ విధమైన సమాచారం కూడా లభించలేదు. 

మహిళను చంపేసి గుర్తు పట్టకుండా ఉండడానికి ముఖం మీద పెట్రోలు పోసి తగులబెట్టడంతో కేసును ఛేదించడం కష్టంగా మారింది. అయితే, ఆమె చీర కొంగుకు ముడి కనిపించింది. ముడి విప్పి చూస్తే అందులో ఓ చిన్న చీటీ కనిపించింది. అందులో ఓ ఫోన్ నెంబర్ రాసి ఉంది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

అది నేరేడ్ మెట్టుకు చెందిన వ్యక్తి ఫోన్ నెంబర్ అని తెలిసింది. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. ఆమె పేరు వెంకటమ్మ అని, జూబ్లీహిల్స్ లోని వెంకటగిరిలో నివాసం ఉంటుందని చెప్పాడు.

రాచకొండ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించారు. జనవరి 1వ తేదీ నుంచి వెంకటమ్మ కనిపించడం లేదని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ రోజు ఆమె ఫోన్ బేగంపేటలో స్విచాఫ్ అయినట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. 

ఓ చోట ఆమె మరో వ్యక్తితో కలిసి ఆటో ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ఫొటోను మృతురాలి కుటుంబ సభ్యులకు చూపించారు. అతన్ని తాము చూడలేదని వారు చెప్పారు. మల్కాజిగిరికి చెందిన వ్యక్తి కూడా అతనెవరో తనకు తెలియదని చెప్పాడు. 

click me!