వర్షాలకు పాములు ఇంట్లోకి వస్తుండడంతో ఓ వ్యక్తి జీహెచ్ఎంసీ ముందు పాముతో తీవ్ర నిరసనకు దిగాడు.
హైదరాబాద్ : తెలంగాణలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నీట మునుగుతున్నాయి. దీంతో పాములు, విషకీటకాలు ఇళ్లలోకి చేరుతున్నాయి.
ఆల్వాల్ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇలాగే జరిగింది. హైదరాబాద్ లోని ఆల్వాల్ లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నీళ్లు పూర్తిగా ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతోపాటే పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులకు ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.
తీవ్ర ఆగ్రహానికి గురైన ఆల్వాల్ నివాసి సంపత్ అనే యువకుడు తన నిరసనను వినూత్న రీతిలో వ్యక్తం చేశాడు. తన ఇంట్లోకి వచ్చిన పాముతో ఆల్వాల్ జీహెచ్ఎంసీకి చేరుకున్నాడు. కార్యాలయంలోని ఓ టేబుల్ మీద పామును విడిచిపెట్టి వినూత్న నిరసనకు దిగాడు. దీంతో కార్యాలయం సిబ్బంది షాక్ అయ్యారు.
భారీవర్షాల కారణంగా అల్వాల్ ప్రాంతంలోని సంపత్ కుమార్ అనే యువకుడి ఇంట్లోకి వరద నీటితో పాటు పాము ప్రవేశించింది. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా 6 గంటలపాటు స్పందన లేకపోవడంతో.. సంపత్ ఓపిక నశించి పామును జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయానికి తీసుకొచ్చి టేబుల్‌పై ఉంచి నిరసన తెలిపాడు.