వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ తీగలను తాకి భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
జహిరాబాద్ : అడవి పందులనుండి చెరకు తోటను కాపాడుకునేందుకు ఏర్పాటుచేసిన విద్యుత్ కంచె భార్యాభర్తలను బలితీసుకుంది. తోటకు గడ్డిమందు పిచికారీ చేస్తుండగా ఒక్కసారిగా భార్య విద్యుత్ షాక్ కు గురయ్యింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త కూడా షాక్ కు గురయ్యాడు. ఇలా భార్యాభర్తలిద్దరూ కరెంట్ షాక్ కు గురయి పొలంలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డ జిల్లా ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామానికి చెందిన దేవదాసు(34), మరియమ్మ(32) భార్యాభర్తలు. వ్యవసాయ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేవారు. అయితే అనుకోని ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మృతిచెందారు.
నిన్న(మంగళవారం) చెరకుతోటలో గడ్డిమందు పిచికారీ చేయడానికి దేవదాసు, మరియమ్మ దంపతులు వెళ్లారు. భార్య నీరు తెచ్చి పోస్తుండగా భర్త మందు పిచికారీ చేస్తుండగా ప్రమాదం జరిగింది. నీరు తెచ్చే క్రమంలో అడవి పందుల నుండి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటుచేసిన కరెంట్ తీగ మరియమ్మ కాలికి తగిలింది. దీంతో కరెంట్ షాక్ కు గురయిన ఆమె కిందపడిపోయింది.
Read More హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ ఘటన.. స్పాట్‌లోనే వృద్దురాలి మృతి
భార్య కేకలు విన్న దేవదాస్ కంగారుగా వెళ్లిచూడగా భార్య కిందపడిపోయి వుంది. దీంతో ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తూ అతడు కూడా కరెంట్ షాక్ కు గురయ్యాడు. ఇలా భార్యాభర్తలిద్దరూ చెరకు తోటలోనే కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు.
చుట్టుపక్కల పొలంలోని రైతులు దంపతులు కేకలు విని అక్కడికి చేరుకోగా అప్పటికే వారు మృతిచెందారు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వారువచ్చి మృతదేహాలను అక్కడినుండి తరలించారు. తల్లిదండ్రులు ఒకేసారి మృతిచెందడంతో మనోజ్(14), మానస(9) అనాధలుగా మారారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద రోదించడం అక్కడున్న అందరితో కన్నీరు పెట్టిస్తోంది.