పిల్లనివ్వడం లేదని ఉద్యోగం వదిలేసిన కానిస్టేబుల్.. మళ్లీ విధుల్లోకి..

By telugu news teamFirst Published May 14, 2020, 8:32 AM IST
Highlights

ఇంజినీరింగ్‌ అనంతరం ప్రతాప్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై చార్మినార్‌ పీఎస్‌లో పనిచేసేవారు. చాలా పెళ్లి సంబంధాలు చూసినా.. కానిస్టేబుల్‌కు పిల్లనివ్వమంటున్నారన్న ఆవేదనతో ఏకంగా పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసి రాజీనామా చేశారు.

అతను ఇంజినీరింగ్ చదివాడు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో కుదురుకున్నాను కదా అని.. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. అయితే.. కానిస్టేబుల్ అని చెప్పేసరికి ఎవరూ పిల్లని ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో.. పెళ్లి కానప్పుడు ఈ ఉద్యోగం నాకెందుకు అని వదిలేశాడు. తర్వాత బిజినెస్ మెన్ అవతారం ఎత్తాడు. అయినా కూడా ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదట. అందుకే మళ్లీ కానిస్టేబుల్ గా విధుల్లోకి చేరాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ జిల్లా కొత్తవలసకు చెందిన ప్రతాప్‌ తండ్రి ఈశ్వర్‌రావు చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. పాల వ్యాపారం చేస్తూ ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని బాగా చదివించారు.

ఇంజినీరింగ్‌ అనంతరం ప్రతాప్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై చార్మినార్‌ పీఎస్‌లో పనిచేసేవారు. చాలా పెళ్లి సంబంధాలు చూసినా.. కానిస్టేబుల్‌కు పిల్లనివ్వమంటున్నారన్న ఆవేదనతో ఏకంగా పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసి రాజీనామా చేశారు. ఆపై బిజినెస్‌ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయతాల్లో పెళ్లి సంబంధాలు చూసినా కలిసి రాలేదు.

దీంతో.. మళ్లీ తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని పెట్టుకున్న అర్జీని అధికారులు ఓకే చేయటంతో.. ప్రతాప్‌ మళ్లీ విధుల్లో చేరారు. ప్రస్తుత పోస్టింగ్‌ చార్మినార్‌ పీఎస్‌లో అయినా.. డీపీజీ కార్యాలయంలో కంప్యూటర్‌ విభాగంలో డిప్యుటేషన్‌లో పనిచేస్తున్నారు. తన కుమారుడు మనసు మార్చుకుని మళ్లీ ఉద్యోగంలో చేరటం సంతోషంగా ఉందని ఆయన తండ్రి ఈశ్వర్‌రావు చెప్పారు

click me!