
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వెలిసి పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. గతంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పోస్టర్లు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కవిత ఈడీ విచారణ సమయంలో.. ఈడీ, సీబీఐలతో బీజేపీ బెదిరింపు రాజకీయాలు చేస్తుందని హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీలో చేరిన కొందరు నాయకులను పేర్కొంటూ నగరంలోని పలుచోట్ల పోస్టర్లు అంటించారు.
ఆ పోస్టర్లలో కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేత సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలను ఉంచారు. చివర్లో బై బై మోదీ (#Bye Bye Modi)అని ఆ పోస్టర్లు, ఫ్లెక్సీలలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో.. ఆమె ఇప్పటికే లీగల్ టీమ్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ప్రస్తుతం తెలంగాణ అడిషనల్ ఏజీ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కవితకు మద్దతుగా ఇప్పటికే ఢిల్లీకి చేరకున్నారు. ప్రస్తుతం కవిత ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో బస చేస్తుండగా.. అక్కడికి భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక, ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు కవిత.. బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది.