దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాలు గాంధీకి తరలించేందుకు ఏర్పాట్లు

By narsimha lodeFirst Published Dec 9, 2019, 6:22 PM IST
Highlights

దిశ నిందితుల  మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు ఈ చర్యలు తీసుకొంటున్నారు. 

హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలను హైద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు  గాంధీ ఆసుపత్రికి దిశ నిందితుల మృతదేహాలను తరలించనున్నారు.

ఈ నెల 6వ తేదీ ఉదయం షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లిలో దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిందితుల మృతదేహాలకు మహాబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: కీలకమైన సీసీటీవీ పుటేజీ స్వాధీనం

ఈ పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం మార్చురీలోనే మృతదేహాలను ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చురీలోనే  నిందితుల మృతదేహాలు ఉన్నాయి.

ఈ నెల 7వ తేదీన మహాబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలోనే ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం మార్చురీలోనే పరిశీలించారు. అయితే ప్రభుత్వాసుపత్రిలో సరైన వసతులు లేని కారణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని అనాటమీ విభాగానికి పోలీసులు  నిందితుల మృతదేహాలను తరలించారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై హైకోర్టు సోమవారం నాడు విచారణ జరిపింది.ఈ విచారణ తర్వాత  మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా గాంధీ నుండి ఫ్రీజర్ బాక్స్‌లను తీసుకొచ్చిన తర్వాత ఫ్రీజర్ బాక్సుల్లో మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే మృతదేహాలు డీ కంపోజ్ దశకు చేరుకొని ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రసాయనాలను స్ప్రే చేసి దుర్వాసన రాకుండా చేయడంతో పాటు  మృతదేహాలు పాడు కాకుండా అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

కనీసం తమ వారి మృతదేహాలను కడసారి చూసుకొనే అవకాశం కల్పించాలని నిందితుల కుటుంబసభ్యులు కోరుతన్నారు.


 

click me!