కోదండరాం విడుదల

First Published Feb 22, 2017, 2:07 PM IST
Highlights

ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, నిరసన తెలిపే అవకాశం కూడా తమకు ఇవ్వడం లేదని కోదండరాం విమర్శించారు.

తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాంను పోలీసులు విడుదల చేశారు.  నిరుద్యోగుల నిరసన ర్యాలీ నేపథ్యంలో  రాత్రి 3 గంటలకు తార్నాకలోని ఆయన నివాసంలోకి చొరబడి బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు దాదాపు 15 గంటల తర్వాత ఇంటికి తరలించారు.

 

అయితే ఇన్ని గంటలపాటు ఆయన ఎక్కడున్నారో తెలియక జేఏసీ నేతలు కంగారు పడ్డారు. కోదండరాం సతీమణి దీనిపై సీపీని కూడా కలిశారు.  ఈ నేపథ్యంలో  కామాటిపురా పోలీసు స్టేషన్‌ నుంచి ఆయనను రాత్రి 7 గంటల సమయంలో విడుదల చేసి, తార్నాక ఉన్న ఆయన ఇంటికి తరలించారు.

 

నిరుద్యోగుల నిరసన ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించాలని నెల రోజుల నుంచే కోదండరాం జిల్లాల వారిగా పర్యటించారు.

 

అయితే ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, కోర్టులు ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో జేఏసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

 

దీంతో పోలీసులు నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ముందస్తు చర్యగా నిన్నటి నుంచే జేఏసీ నేతలను అరెస్టు చేశారు.

 

కాగా, విడుదల అనంతరం పోలీసు స్టేషన్ వద్దే కోదండరాం మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, పోలీసులు అనుమతించలేదు.  ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, నిరసన తెలిపే అవకాశం కూడా తమకు ఇవ్వడం లేదని కోదండరాం విమర్శించారు.

 

click me!