నాగోలు కాల్పుల ఘటనలో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 15 బృందాలు.. పక్కాగా రెక్కీ నిర్వహించిన దుండగులు!

By Sumanth KanukulaFirst Published Dec 2, 2022, 10:38 AM IST
Highlights

హైదరాబాద్ నాగోల్‌ స్నేహాపురి కాలనీలోని మహదేవ్ జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 15 బృందాలను రంగంలోకి దింపారు.
 

హైదరాబాద్ నాగోల్‌ స్నేహాపురి కాలనీలోని మహదేవ్ జ్యువెలర్స్‌లో కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం రాత్రి మహదేవ్ జ్యువెలర్స్‌లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. కాల్పులు జరిపి, షాప్‌లోని బంగారం తీసుకుని పారిపోయారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు  గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు 15 బృందాలను రంగంలోకి దింపారు. మహదేవ్ జ్యువెలర్స్‌తో పాటు పరిసరాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. క్లూస్ టీమ్‌ను కూడా ఘటన స్థలంలో ఆధారాలను సేకరించింది. మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అయితే దుండగులు పక్కాగా రెక్కీ నిర్వహించి ఈ దోపిడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన సుఖ్‌రామ్‌తో పాటు మరో వ్యక్తిని టార్గెట్ చేసి దుండగులు దోపిడికి ప్లాన్ చేశారు. బంగారం వ్యాపారం చేస్తున్న సుఖ్‌రామ్‌, రాజ్‌ కుమార్‌లు.. రిటైల్ షాపులకు బంగారం సరఫరా చేస్తుంటారు. వీరు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి కొన్ని ప్రాంతాల్లో బంగారం సప్లై చేశారు. అయితే వీరిని ఫాలో అవుతున్న దుండగులు.. మహదేవ్ జ్యువెలర్స్‌లో బంగారం సప్లై చేస్తుండగా షాప్‌లోని ప్రవేశించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపిన దుండగులు దాదాపు కిలో బంగారం, రూ. 1.70 లక్షల నగదుతో పరారయ్యారు. అయితే దుండగులు నెంబర్ ప్లేట్ లేని బైక్‌లను వినియోగించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో గాయపడిన షాప్ యజమాని కళ్యాణ్‌ చౌదరి పాటు సుఖ్‌రామ్‌లకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిని శుక్రవారం సాయంత్రం రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరామర్శించారు. కాల్పుల ఘటనపై వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ భగవత్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా మహదేవ్ జ్యువెలర్స్‌ నడుస్తోందని చెప్పారు. సికింద్రాబాద్‌లోని గణపతి జ్యువెలర్స్‌ వారికి బంగారం తయారు చేసి ఇస్తారని తెలిపారు.  గత రాత్రి గణపతి జ్యువెలర్స్‌ ఓనర్, అతని వర్కర్ మహదేవ్ జ్యువెలర్స్‌‌కు రావడం జరిగిందన్నారు. కొంతసేపటికి ఇద్దరు నిందితులు లోనికి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఒకరు హెల్మెట్ పెట్టుకున్నారని.. మరోకరు మొహం కనిపించుకుండా స్కార్ప్ కట్టుకున్నారని తెలిపారు. 

లోనికి ప్రవేశించిన  వెంటనే షట్టర్ క్లోజ్ చేసిన కాల్పులు  జరిపారని చెప్పారు. కళ్యాణ్ చౌదరి, సుఖ్ రామ్‌లపై కాల్పులు జరిపి బంగారం తీసుకెళ్లారని చెప్పారు. అనంతరం బయటకు వచ్చి పారిపోయారని తెలిపారు. ఇంకో వ్యక్తి కూడా వాళ్లతో ఉన్నట్టుగా కనిపిస్తోందని చెప్పారు. బంగారం సప్లై చేసే వ్యక్తులు ప్రతి వారం ఇలా వస్తున్నారని తెలిసి.. రెక్కీ నిర్వహించిన చేసినట్టుగా అనుమానిస్తున్నట్టుగా చెప్పారు. అయితే దుండగులను అడ్డుకునేందుకు షాప్‌లో ఉన్నవారు ప్రయత్నించినప్పటికీ.. కాల్పులు జరపడం వల్ల వారిని నియంత్రించలేకపోయారని తెలిపారు. ఎంత బంగారం చోరీ అయిందనే తెలియాల్సి ఉంది. సుఖ్ రామ్ తీసుకొచ్చిన బ్యాగ్‌ను మాత్రమే తీసుకెళ్లారని చెప్పారు. పాత నేరస్తులకు సంబంధించివారు ఈ పనికి పాల్పడ్డారనే కోణంలో కూడా తమ బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టుగా చెప్పారు.

click me!