మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.అయితే ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తానని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
నిర్మల్: మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిరహార దీక్షను సోమవారంనాడు పోలీసులు భగ్నం చేశారు.ఆయనను ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నిరహారదీక్షను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు.
ఆసుపత్రిలో మహేశ్వర్ రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేశ్వర్ రెడ్డి ఇంటిని ముట్టడికి బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది. రాజకీయ లబ్ది కోసం మహేశ్వర్ రెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.అందుకే మహేశ్వర్ రెడ్డి ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చినట్టుగా నిర్మల్ మున్సిపల్ చైర్మెన్ ఈశ్వర్ తెలిపారు. దీంతో మహేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లే మార్గాలను మూసివేశారు పోలీసులు.
మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసేవరకు తన దీక్ష కొనసాగిస్తానని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.