గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ కు నోటీసులిచ్చారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హట్ పోలీసులు సోమవారం నాడు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు నోటీసులిచ్చారు. తెలంగాణ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు . ఈ విషయమై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
గత ఏడాది ఆగస్టు మాసంలో సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియోను అప్ లోడ్ చేశారని రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఇదే తరహ కేసులు రాజాసింగ్ పై నమోదు కావడంతో రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ ను నమోదు చేశారు. పీడీ యాక్ట్ కింద పోలీసులు గత ఏడాది ఆగస్టు 25న అరెస్ట్ చేశారు.
పీడీ యాక్ట్ పై జైల్లో ఉన్న రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు 2022 నవంబర్ 9వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులను కూడా హైకోర్టు విధించింది. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని కూడా కోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను రాజాసింగ్ ఉల్లంఘించి ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుపై రాజాసింగ్ ఎలా స్పందిస్తారోననే విషయమై ఆసక్తి నెలకొంది.
గత ఏడాది ఆగస్టు మాసంలో కమెడియన్ మునావర్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వవద్దని కూడా రాజాసింగ్ , బీజేపీ నేతలు కోరారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ కార్యక్రమంపై విమర్శలు చేస్తూ రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోను నిరసిస్తూ ఎంఐఎం నేతలు ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.