తెలంగాణ బడ్జెట్ కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని గవర్నర్ ను తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.
హైదరాబాద్:తెలంగాణ బడ్జెట్ కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సోమవారం నాడు రాత్రి ఆమోదించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిన్న రాత్రి గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ ను మంత్రి ఆహ్వానించారు.
పుదుచ్చేరి నుండి హైద్రాబాద్ కు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు, తెలంగాణ ఆర్దిక శాఖ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా గవర్నర్ ను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. మరో వైపు తన వద్ద పెండింగ్ లో ఉన్న బడ్జెట్ ఫైలుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంతకం చేశారు.
రాష్ట్ర బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించడం లేదని కేసీఆర్ సర్కార్ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై నిన్న ఉదయం వాదనలు జరిగాయి. లంచ్ బ్రేక్ కు ముందు ఈ విషయమై ఇరువర్గాల న్యాయవాదులు చర్చించుకోవాలని హైకోర్టు సూచించింది. దీంతో అడ్వకేట్ జనరల్ చాంబర్ లో ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్యంత్ ధవే, రాజ్ భవన్ తరపున వాదించిన ఆశోక్ చర్చించారు.
గవర్నర్ పై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయకూడదని గవర్నర్ తరపు న్యాయవాది కోరారు. రాజ్యాంగబద్దంగా నిర్వర్తించాల్సిన విధులను అడ్డుకుంటే నెలకొనే సంక్షోభంపై కూడా చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన అంశాలను గవర్నర్ తరపు న్యాయవాది గుర్తించారు.
also read:రాజ్ భవన్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డి: బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ఆహ్వానం
ఈ విషయమై ప్రభుత్వంతో అడ్వకేట్ జనరల్ చర్చించారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తామని ప్రభుత్వ పెద్దల నుండి అడ్వకేట్ జనరల్ కు సమాచారం అందింది. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత విచారణ ప్రారంభం కాగానే లంచ్ మోషన్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది ధవే హైకోర్టుకు తెలిపారు. మరో వైపు రాజ్యాంగ బద్దంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ధవే తెలిపారు. ఈ పిటిషన్ పై విచారణను ముగిస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది. దీంతో నిన్న రాత్రి రాజ్ భవన్ లో గవర్నర్ తో వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు.
గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ దఫా కూడ అలానే సాగే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగింది. అయితే బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ను ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఫిబ్రవరి 6వ తేదీన బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.