హైదరాబాద్‌లో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదు: సౌత్ జోన్ డీసీపీ

By Sumanth KanukulaFirst Published Aug 24, 2022, 4:32 PM IST
Highlights

హైదరాబాద్‌లో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని సౌత్ జోన్ డీసీపీ స్పష్టం చేశారు. నగరంలో ర్యాలీలకు ఎవరూ పిలుపునివ్వద్దని చెప్పారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. 

హైదరాబాద్‌లో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని సౌత్ జోన్ డీసీపీ స్పష్టం చేశారు. నగరంలో ర్యాలీలకు ఎవరూ పిలుపునివ్వద్దని చెప్పారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. రాజకీయ లబ్దికోసం కొందరు చేస్తున్నదాంట్లో యువత పడొద్దని సూచించారు. రాజాసింగ్ వ్యవహారంలో పోలీసులు వేగంగా  చర్యలు తీసుకున్నారని చెప్పారు. 

ఇక, మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని పాతబస్తీలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. మరోవైపు రాజాసింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆయన అనుచరులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ పరిస్థితుల్లో పాతబస్తీలో సోమవారం రాత్రి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజా సింగ్ తన ఇంటికి చేరుకున్నారు. రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. 

పాతబస్తీలో రోడ్ల పైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్ వద్ద పెద్దసంఖ్యలో యువకులు గుమిగూడారు. శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మొగల్పురాలో పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో హైటెన్షన్ నెలకొంది.  పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. 

రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నందున నగర పోలీసులు బుధవారం పాతబ‌స్తీలోని అన్ని పెట్రోల్ పంపులను మూసివేశారు. భారతీయ పురావస్తు శాఖ (ASI)  అధికారులు మీడియాతో మాట్లాడుతూ..  చార్మినార్ సందర్శకుల కోసం తెరిచి ఉంచబడిందని, అయితే ఏదైనా పెద్ద నిరసన లేదా ప‌రిస్థితులు దిగ‌జారే విధంగా ఉంటే మూసివేయబడుతుందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు చెందిన పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహ‌రించారు.
 

click me!