
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. క్యూ న్యూస్ మాజీ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం వుంది. ప్రస్తుతం విచారణ నిమిత్తం ఆయనను చిలుకలగూడ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మల్లన్న అభిమానులు.. భారీ ఎత్తున చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు.
కాగా, తీన్మార్ మల్లన్న కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగి ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సి ఆర్ పి ఎస్ 41ఎ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు. పీర్జాదిగూడ లోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ పంపనున్నారు. నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు.
ALso REad:తీన్మార్ మల్లన్నకు నోటీసులు.. కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతానంటూ హెచ్చరిక..
తన కార్యాలయంలో సోదాల మీద తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిప్పులు చెరిగాడు. వరంగల్ అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ను వరంగల్లోనే రాజకీయ సమాధి కడతారని తీన్మార్ మల్లన్న హెచ్చరించాడు. కెసిఆర్ 400 మంది పోలీసులతో తన ఆఫీసులో తనిఖీలు చేయించాడని.. అయితే పోలీసులు తనిఖీలు చేయాల్సింది ఆయన ఫాంహౌస్లో అని చెప్పాడు. యువతితో ఫిర్యాదు విషయంలో కెసిఆర్ త్వరలోనే ఫూల్ కాబోతున్నాడని ఎద్దేవా చేశాడు. వరంగల్ ను తెలంగాణ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. హుజురాబాద్ లో టిఆర్ఎస్ కు ఓటమి తప్పదని హెచ్చరించాడు.
"