
ప్రొఫెసర్ హరగోపాల్‌పై పెట్టిన ‘ఉపా’ కేసును పోలీసులు ఎత్తివేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిపైనా పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హరగోపాల్, పద్మజా షా, అడ్వకేట్ రఘునాథ్, గడ్డం లక్ష్మణ్ , గుంటి రవీంద్ర, సురేష్ కుమార్‌లపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసులు ఎత్తివేస్తూ న్యాయపరంగా కోర్టులో మెమో దాఖలు చేస్తామని ములుగు ఎస్పీ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా.. ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు ఏడాది క్రితం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు మరో 151 మందిని నిందితులుగా చేర్చారు. ఉపాతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.ప్రజా ప్రతినిధులు చంపేందుకు కుట్ర చేశారని పోలీసులు ఆరోపించారు. మావోయిస్టుల పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇందులో హరగోపాల్‌ను నంబరు 42గా పేర్కొన్నారు. ఈ కేసులో కొందరిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నప్పటికీ.. హరగోపాల్‌ను మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇక, హరగోపాల్‌పై యూఏపీఏ కేసు విషయం ఇటీవల వెలుగులోకి రాగా.. పలువురు పోలీసులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ALso Read: ప్రొ. హరగోపాల్, ఇతరులపై ఉపా కేసు ఎత్తివేయాలని కేసీఆర్ నిర్ణయం.. డీజీపీకి ఆదేశం..!!
వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ హరగోపాల్‌తో ఇతరులపై నమోదైన ‘ఉపా’ కేసులను తక్షణం ఎత్తివేయాలని ఆయన డీజీపీ అంజనీకుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చిన గంటల వ్యవధిలోనే హరగోపాల్ తదితరులపై కేసులు ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.