
బీజేపీ, బీఆర్ఎస్‌లపై మండిపడ్డారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా బీజేపీ విమర్శలు చేస్తూ వచ్చిన సీఎం కేసీఆర్ ఉన్నట్లుండి గవర్నర్ తమిళిసైని కలిసి ఆ పార్టీతో వున్న మైత్రిని బయటపెట్టారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం వుందని.. గవర్నర్‌తో కలిసి నిన్న కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలకడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి.. ఇతర పార్టీలను ఎదగనీయకుండా చేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను వదిలించుకోవాల్సిన అవసరం వుందని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రొఫెసర్ హరగోపాల్‌ను చట్టాల పేరుతో ఇబ్బందులు పెడుతున్నాని భట్టి మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి గురించి తమ వద్ద సమాచారం వుందంటున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వుంటాయని భట్టి విక్రమార్క తెలిపారు.
కాగా.. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హస్తం పార్టీలో వారి చేరికకు ముహుర్తం ఫిక్స్ అయినట్టుగా సమాచారం. ఈ నెల 22న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ.. ఈ నెల 21న స్వదేశానికి చేరుకోనున్నారు. అదే రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హస్తినకు వెళ్లనున్నారు. ఆ మరుసటి రోజే రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల భేటీ కానున్నారు.
ALso Read: కాంగ్రెస్‌లో పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల చేరికకు ముహుర్తం ఫిక్స్..!!
పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఖమ్మం, మహబూబ్ నగర్‌లలో బహిరంగ సభలు నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సభల్లోనే నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా సమాచారం. ఇక, ఇప్పటికే జూపల్లి కృష్ణారావు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కాంగ్రెస్ నేత సంపత్.. జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా సమావేశమై ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
ఇక, రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూమ్ కాల్ ద్వారా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. జూమ్ మీటింగ్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ జూమ్ సమావేశం తర్వాత పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత వచ్చిందనే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ గూటికి పొంగులేటిని తీసుకురావడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా కీలక భూమిక పోషించారనే ప్రచారం సాగుతుంది.