
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ (amnesia pub rape ) అత్యాచారం కేసులో పోలీసులు విచారణను పూర్తి చేశారు. కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. నేరం నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇప్పటికే 400 పేజీల ఛార్జిషీట్ సిద్ధం చేశారు విచారణ ఇన్‌స్పెక్టర్. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక, సీసీ ఫుటేజ్, కాల్ సీడీఆర్‌లు కీలకం కానున్నాయి. పక్కా ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. మే 28న ఈ ఘటన జరగ్గా.. మే 31న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు సాదుద్దీన్ మాలిక్ సహా నలుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల్లోనే విచారణ పూర్తి చేశారు అధికారులు.
ఇప్పటికే ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (cv anand) మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మొత్తం మార్చి 28న మొదలైందని.. బెంగళూరులో వుంటున్న ఓ విద్యార్ధి పాఠశాలల ప్రారంభానికి ముందు పార్టీ చేసుకోవాలని భావించాడని కమీషనర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా తన ముగ్గురు స్నేహితులను సంప్రదించాడని.. ఇందుకోసం నగరంలో ఏ పబ్ బాగుంటుందని స్నేహితులను అడిగి తెలుసుకున్నాడని సీపీ చెప్పారు.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లని అమ్నేషియా పబ్ సెలెక్ట్ చేసుకున్నారని.. పార్టీ చేసుకునేందుకు నిర్ణయించుకుని ఒక మైనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడని ఆయన తెలిపారు. నాన్ ఆల్కహలిక్, నాన్ స్మోకింగ్ పార్టీ పేరుతో పబ్ బుక్ చేసి.. ఒక్కొక్కరికి రూ.1200 చొప్పున వుండే టికెట్‌ను నిర్వాహకులను ఒప్పించి రూ.900కు తగ్గించారని ఆనంద్ వెల్లడించారు. మే 28న పార్టీకి సంబంధించిన వివరాలను మరోసారి ఇన్‌స్టా ద్వారా తెలియజేశారని.. అయితే టికెట్ రూ.900 అన్న విషయాన్ని దాచి, ఒక్కొక్కరి నుంచి రూ.1200 వసూలు చేశారని ఆయన తెలిపారు. 25వ తేదీన మైనర్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడని, అనంతరం పబ్ నిర్వాహకులకు రూ.లక్షను అడ్వాన్స్‌గా చెల్లించారని సీపీ తెలిపారు. ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా బాధిత యువతి టికెట్ కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు.
మే 28న మధ్యాహ్నం 1.10 గంటలకు బాలిక మరో బాలుడితో కలిసి పబ్‌కి వచ్చిందని.. 1.50 వరకు డ్యాన్స్ చేస్తూ అక్కడే గడిపారని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో 3.15 గంటలకు నిందితుల్లో ఒకరు బాలికతో మాటలు కలిపారని.. ఆ తర్వాత మరో నిందితుడు సాబుద్దీన్ పరిచయం చేసుకున్నాడని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని.. తర్వాత 5.10కి మరింత రెచ్చిపోయారని దీంతో బాలిక, ఆమె స్నేహితురాలు పబ్ నుంచి బయటకు వచ్చేశారని కమీషనర్ పేర్కొన్నారు.
బాలికతో ఇద్దరూ అసభ్యంగా ప్రవర్తించాడని గమనించిన మిగిలిన నిందితులకు ఆ సమయంలోనే అత్యాచారం చేయాలనే ఆలోచనకు వచ్చారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే వీరంతా బాలికను అనుసరించారని.. అయితే ఆమె స్నేహితురాలు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయిందని సీపీ చెప్పారు. అయితే నిందితులు మాత్రం బాలికకు మాయ మాటలు చెప్పి బెంజ్‌కారులోకి ఎక్కించి అనంతరం పబ్‌కి తీసుకెళ్లారని ఆయన తెలిపారు. కారులో నగరమంతా తిప్పుతూ బాలికను బలవంతంగా ముద్దాడేందుకు యత్నించారని.. ఆపై వీడియోలు, ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టారని సీపీ చెప్పారు.
అనంతరం సాయంత్రం 5.54 గంటలకు బాలిక బెంజ్ నుంచి ఇన్నోవాకి మారిందని.. ఈ ఇన్నోవాలో సాబుద్దీన్ మాలిక్, ఐదుగురు మైనర్లు వున్నారని కమీషనర్ పేర్కొన్నారు. వీరిలో ఒక మైనర్ వెనక్కి తిరిగి వచ్చాడని.. అనంతరం నిందితుల్లో ఒకరు రోడ్ నెం 44లోని నిర్మానుష్య ప్రదేశంలో ఇన్నోవాను పార్క్ చేసి బాలికపై అత్యాచారం చేశాడని సీపీ తెలిపారు. తర్వాత అదే కారులో తిప్పుతూ మిగిలిన వారు కూడా రేప్ చేశారని.. ఈ క్రమంలో బాలిక మెడ, శరీరంపై గాయాలయ్యాయని సీవీ ఆనంద్ వెల్లడించారు.
అనంతరం బాలికను పబ్ వద్ద విడిచిపెట్టారని.. రాత్రి 7.50 గంటల సమయంలో బాలిక తన తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి ఇంటికి తీసుకెళ్లాడని కమీషనర్ తెలిపారు. 28న బాధితురాలిపై అత్యాచారం జరిగినప్పటికీ ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదని.. అయితే బాలిక మెడపై వున్న గాయాలు వుండటం చూసి వారు ప్రశ్నించారని ఆయన పేర్కొన్నారు. అయితే ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో బాలిక నోరు విప్పిందని.. కానీ అప్పటికే మూడు రోజులు ఆలస్యమైందని సీపీ చెప్పారు. దీనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, అనంతరం అత్యాచారం కేసు నమోదు చేశామన్నారు. 3వ తేదీన సాబుద్దీన్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.
ఆరుగురు నిందితుల్లో ఐదుగురు ఆమెపై అత్యాచారం చేశారని.. ఒక మైనర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినందున అతనిపైనా కేసు నమోదు చేసినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. ఇకపోతే.. ఈ కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం జరిగిందంటూ వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. బలమైన ఆధారాల సేకరణ వల్లే ఆలస్యమైందని.. ఎవరినీ తప్పించే ప్రయత్నం చేయలేదని సీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో గ్యాంగ్ రేప్ సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులకు మూడు రకాల శిక్షలు పడే అవకాశముందని కమిషనర్ ఆనంద్ చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్ష, జీవిత ఖైదు, లేదంటే ఉరి శిక్ష పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అత్యాచారానికి పాల్పడని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.