కొత్త సచివాలయానికి వెళ్లేందుకు యత్నం.. షబ్బీర్ అలీ, మల్లు రవి అరెస్ట్.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత..

By Sumanth KanukulaFirst Published Feb 3, 2023, 1:45 PM IST
Highlights

కొత్త సచివాలయానికి బయలుదేరిన టీ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కొత్త సచివాలయానికి బయలుదేరిన టీ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే కొత్త సచివాలయాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరేందుకు యత్నించాయి. నూతన సెక్రటేరియట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణ జరగాలంటూ నిరసనకు దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లురవి, షబ్బీర్ అలీలను కూడా గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 

దీంతో పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషా మహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 
 

 

A massive fire broke out in the new Secretariat building, slated for inauguration on February 17. But KCR Govt is trying to hush up the incident by calling it a 'mock drill'. Police arrested Congress leaders at Gandhi Bhavan to stop them from visiting the Secretariat. pic.twitter.com/ztPiOMmzHt

— Mohammad Ali Shabbir (@mohdalishabbir)

ఇక, తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. 11 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. 

click me!