మూసీలో పోటెత్తిన వరద: హైద్రాబాద్ జియాగూడ-పురానాపూల్ రోడ్డు మూసివేత

By narsimha lode  |  First Published Sep 6, 2023, 3:18 PM IST

మూసీ నదికి వరద పోటెత్తడంతో  హైద్రాబాద్ జియాగూడ-పురానాపూల్ రోడ్డును అధికారులు మూసివేశారు.



హైదరాబాద్:నాలుగైదు రోజులుగా  తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో  మూసీకి భారీగా వరద పోటెత్తింది.దీంతో జియాగూడ-పురానాపూల్  రోడ్డును  బుధవారంనాడు మూసివేశారు.
నాలుగు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడ  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో  భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

హైద్రాబాద్ జంట జలాశయాలైన  హిమాయత్ సాగర్,  ఉస్మాన్ సాగర్ ల  నుండి  మూసీ నదిలోకి వరద పోటెత్తింది.  దీంతో  మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను  అప్రమత్తం చేశారు అధికారులు.ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుండి  6 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా మూసీ నదిలో కలుస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో  హిమాయత్ సాగర్ కు 4 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతుంది. ఆరు గేట్ల ద్వారా మూసీలోకి 4,120  క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.  హిమాయత్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు. 

Latest Videos

also read:మూసీకి పోటెత్తిన వరద: యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్

ఇదిలా ఉంటే ఉస్మాన్ సాగర్ జలాశయం ఇన్ ఫ్లో  2200 క్యూసెక్కులు వస్తుంది.  ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం  1789.90 అడుగులు. ఆరు గేట్ల ద్వారా మూసీలోకి 2,028 క్యూసెక్కుల విడుదల చేశారు అధికారులు.  ఆరు వేల క్యూసెక్కులు మూసీలోకి విడుదల కావడంతో  మూసీలో వరద మరింత పెరిగింది. మూసీలో వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో జియాగూడ-పురానాపూల్ రోడ్డును పోలీసులు మూసివేశారు. ఈ ప్రాంతం గుండా వెళ్లే వాహనాలను  మళ్లించారు.  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని వాహనదారులకు  పోలీసులు సూచిస్తున్నారు.2022 అక్టోబర్  14న కూడ జియాగూడలో రోడ్డుపై  మూసీ నదిపై  వరద నీరు ప్రవహించింది. దీంతో ఈ రోడ్డును  మూసివేశారు.   హైద్రాబాద్ మలక్ పేట మూసారాంబాగ్ వద్ద మూసీపై  ఉన్న బ్రిడ్జిని తాకుతూ  మూసీ నది ప్రవహిస్తుంది. దీంతో  ఈ నెల  5వ తేదీ సాయంత్రం నుండి  మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు.

click me!