
జగిత్యాల: దసరా పండగరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన రౌడీ షీటర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. పండగ రోజు విందుకోసం పిలిచి ఫుల్లుగా మద్యం తాగించిన తర్వాత హతమార్చినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు పథకం ప్రకారమే మృతుడి పాత స్నేహితుడు ఈ హత్యకు పాల్పడినట్లు... అతడికి మరొకడు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేసి రిమాండ్ కు తరలించామని జగిత్యాల డిఎస్పీ ప్రకాష్ వెల్లడించారు.
ఈ హత్యకు సంబంధించి డిఎస్పీతెలిపిన వివరాలిలా ఉన్నాయి. jagitial పట్టణంలోని హనుమార్ వాడకు చెందిన తోట శేఖర్(38), బీట్ బజార్ కు చెందిన సమిండ్ల మహేష్ ఒకప్పుడు మంచి స్నేహితులు. అయితే ఐదేళ్ల క్రితం ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. దీంతో స్నేహితులిద్దరు బద్ద శత్రువులుగా మారారు. గతంలోనే ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకుని చంపుకునే స్థాయిలో గొడవలు జరిగినట్లు డిఎస్పీ తెలిపారు.
శత్రువు శేఖర్ పై కోపంతో రగిలిపోతున్న మహేష్ దసరా పండగ రోజు అంతమొందించడానికి స్కెచ్ వేసాడు. ఇద్దరి కామన్ స్నేహితుడయిన సాయికిరణ్ తో శేఖర్ కు మందు పార్టీ ఇప్పించాడు. వీరిద్దరు కలిసి బీట్ బజార్ లోని ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్ వద్ద పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో శేఖర్ ఫూటుగా మద్యం సేవించి మత్తులోకి వెళ్లిపోయాక మహేష్ కు సాయికిరణ్ సమాచారమిచ్చాడు.
read more జగిత్యాల బీట్ బజార్ లో చికెన్ కొట్టే కత్తితో.. రౌడీ షీటర్ హత్య (వీడియో)
దీంతో అక్కడికి చేరుకున్న మహేష్ పదునైన కత్తితో శేఖర్ పై దాడిచేసాడు. అప్పటికే మద్య మత్తులో వున్న శేఖర్ కు తప్పించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో రక్తపుమడుగులో పడిపోయి అక్కడికక్కడే శేఖర్ ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఘటనా స్థలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో విందు చేసుకున్నట్టు తెలిసింది. ఎవరెవరు విందు చేసుకున్నారో ఆరా తీయగా సాయికిరణ్ పేరు బయటపడింది. దీంతో అతడి కోసం గాలిస్తుండగా జగిత్యాల శివారులో మహేష్ తో కలిసి పట్టుబడ్డాడు. అతడిని విచారించగా జరిగిన విషయాన్ని బయటపెట్టాడని డిఎస్పీ వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.