
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం బీజేవైఎం నేతలు హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు బీజేవైఎం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురు బీజేవైఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌తో మరి కొందరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వారిపై ఐపీ సెక్షన్‌లు 143,147, 448, 353 r/w 149, పీడీపీపీ చట్టంలోని సెక్షన్‌లు 3,4 కింద బేగంబజార్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు కేసు నమోదు చేసినవారిలో భాను ప్రకాష్, శివశంకర్, పవన్‌రెడ్డి, జమాల్‌పూర్ ఆయుష్, ఏ రాజు నేత, మన్మధరావు, పూజారి రాము యాదవ్‌లు ఉన్నారు. వీరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే బీజేవైఏం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం పోలీసు బారికేడ్లను ఛేదించి టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వెలుపల మోహరించిన పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు. ఈ క్రమంలోనే కొందరు బీజేవైఎం కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. వారు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం గేటు ఎక్కి, కమిషన్ సైన్ బోర్డును ధ్వంసం చేసి కార్యాలయ ప్రాంగణంలోకి దూకారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని బీజేవైఎం శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఎగ్జిక్యూటివ్ బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఆందోళన కొనసాగించారు.