విధులు వదిలేసి అధికారుల మందు పార్టీ.. కేసు నమోదు

By telugu news team  |  First Published Apr 15, 2020, 8:52 AM IST
ఆ విందులో పాల్గొన్న తహసీల్దార్ సైదులు, ఈవోపీఆర్డీ రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డిలపై కరోనా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అధికారులే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో మండల స్థాయి అధికారుల్లో కొందరు రాత్రివేళ మందు, విందు పార్టీ చేసుకుంటూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. కాగా.. వారిపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి.

లాక్ డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి.. మందు పార్టీతో ఎంజాయ్ చేసిన నలుగురు అధికారులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై ఉదయ్ కుమార్ చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర బస్టాండ్ సమీపంలోని రెవెన్యూ విశ్రాంతి భవనంలో సోమవారం రాత్రి అధికారులు మందు తాగుతూ.. విందు భోజనం చేస్తూ చిందులు వేశారు.

ఆ విందులో పాల్గొన్న తహసీల్దార్ సైదులు, ఈవోపీఆర్డీ రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డిలపై కరోనా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం తెలిసిన వెంటనే రెవెన్యూ విశ్రాంతి భవనం తనిఖీ చేయగా.. అక్కడ మాటూరుపేట పీహెచ్ సీ వైద్యాధికారి డా. శ్రీనివాస్ పట్టుబడినట్లు పోలీసులు చెప్పారు. దీంతో.. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆయన ద్వారా స్టేట్మెంట్ ఆధారంగా నలుగురు అధికారులపై కేసు నమోదు చేశామన్నారు.

తదుపరి దర్యాప్తులో వీఆర్వో గంటా శ్రీనివాసరావు, ఆర్ఐ మధుసూదన్ రావు కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
click me!