కరోనా వైరస్: ఒక్కడి నుంచి 19 మందికి కోవిడ్ -19 పాజిటివ్

By telugu teamFirst Published Apr 15, 2020, 8:21 AM IST
Highlights
ఒక్క వ్యక్తి నుంచి వికారాబాదులో 19 మందికి కరోనా వైరస్ సోకింది. మర్కజ్ వెళ్లి వచ్చిన అతను పట్టణంలో పలువురిని కలిశాడు, ఆ తర్వాత హైదరాబాదు వెళ్లాడు. ఈలోగా అతని నుంచి 19 మందికి వైరస్ సోకింది.
వికారాబాద్: ఒక్కడి కారణంగా 19 మంది ప్రమాదంలో పడ్డారు. మర్కజ్ వెళ్లి వచ్చినవారంతా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కొంత మంది మొండికేస్తున్నారు. అలాంటివారిలో తెలంగాణలోని వికారాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు. 

వికారాబాద్ పట్టణంలో మంగళవారం మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరుకుంది. కేవలం ఒక్క వ్యక్తి వల్ల 19 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వికారాబాద్ కు చెందిన ఓ సంస్థ నిర్వాహకుడు మార్చి 13వ తేదీన మర్కజ్ వెళ్లి అదే నెల 19వ తేదీన తిరిగి వచ్చాడు. 

ఆ తర్వాత అతను వికారాబాదులో పలువురిని కలుసుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాదు వెళ్లాడు .అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతడు ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడనే విషయాలను తెలుసుకోవడానికి అధికారులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఈలోగానే అతని ఒక్కడి వల్ల 19మందికి కరోనా సోకినట్లు తేలింది.

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 642కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 110 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మంగళవారం కరోనా వైరస్ తో ఒక్కరు మరణించారు. దీంతో తెలంగాణలో మరణాల సంఖ్య 18కి చేరుకుంది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అత్యధికంగా 249 కేసులు నమోదయ్యాయి.
click me!